
టెక్స్‌మాకోతో జేవీకి ఆర్‌వీఎన్‌ఎల్ రెడీ
నవంబర్‌కల్లా కార్యకలాపాలు షురూ
ఆధునిక రైల్వే వ్యవస్థల అభివృద్ధికి నవంబర్‌కల్లా భాగస్వామ్య కంపెనీ(జేవీ)కి తెరతీయనున్నట్లు నవరత్న పీఎస్‌యూ.. రైల్ వికాస్ నిగమ్(ఆర్‌వీఎన్‌ఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు ప్రయివేట్ రంగ సంస్థ టెక్స్‌మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్‌తో ఇటీవలే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా జేవీ ఏర్పాటుకు అవసరమైన చట్టబద్ధ అనుమతులు తీసుకోవడంతోపాటు.. ఇతర కార్యక్రమాలను పూర్తి చేయనున్నట్లు ఆర్‌వీఎన్‌ఎల్ మెకానికల్ విభాగ ప్రధాన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనీష్ అగర్వాల్ తెలియజేశారు.
తద్వారా నవంబర్‌కల్లా జేవీ కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇకపై దేశ, విదేశాలలో తెరతీయనున్న రైల్వే ప్రాజెక్టులలో జేవీ పాలుపంచుకోనున్నట్లు వెల్లడించారు. ఇందుకు రెండు సంస్థలు ప్రాధాన్యతా ప్రాజెక్టులతోపాటు, వ్యాపార అవకాశాలను గుర్తించేందుకు సమాంతరంగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. యాడ్వెంట్ గ్రూప్ సంస్థ టెక్స్‌మాకోతో ఏర్పాటు చేయనున్న జేవీ ద్వారా రైల్వే రంగ తయారీ, డిజైన్ తదితర కార్యకలాపాలు చేపట్టనుంది.
వీటిలో భాగంగా సరుకు రవాణా వేగన్ల నిర్వహణ, ప్రయాణికుల కోచ్‌లు, లోకోమోటివ్స్, మెట్రో కోచ్‌లు తదితరాల తయారీ, డిజైన్, నిర్వహణకు తెరతీయనుంది. అంతేకాకుండా రైల్వేలుసహా అనుబంధ విభాగాలలో ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనుంది. రూ.200 కోట్లతో జేవీ నెలకొల్పే ప్రణాళికలున్నట్లు మనీష్ వెల్లడించారు.
ఇదీ చదవండి: లక్ష మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ