
వచ్చే మూడేళ్లలో 1 లక్ష మంది గ్రాడ్యుయేట్లకు కృత్రిమ మేథ (ఏఐ), గ్రాఫిక్స్ ప్రాసింగ్ యూనిట్ (జీపీయూ) ప్రోగ్రామింగ్ నైపుణ్యాల్లో శిక్షణనివ్వనున్నట్లు కంప్యూటర్ చిప్స్ తయారీ సంస్థ ఏఎండీ తెలిపింది. అలాగే భారతీయ పరిశోధకులు, స్టార్టప్‌లకు 1 లక్ష గంటల పైగా డెవలపర్ క్లౌడ్ యాక్సెస్‌ను ఉచితంగా అందిస్తామని పేర్కొంది.
కంప్యూటింగ్ సామర్థ్యాలను అందరికీ అందుబాటులోకి తేవడమనేది కొత్త తరం ఆవిష్కర్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని, ఓపెన్–సోర్స్ కమ్యూనిటీని బలోపేతం చేసేందుకు తోడ్పడుతుందని ఏఎండీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ పేపర్‌మాస్టర్ తెలిపారు. ప్రతిభావంతులైన భారతీయ ఇంజినీర్లు ఇప్పటికే అంతర్జాతీయంగా హై–పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ఏఐని భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు తీర్చిదిద్దుతున్నారని ఏఎండీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయా జగదీశ్ చెప్పారు. ఇందుకు అవసరమయ్యే అధునాతన సాధనాలు, పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని వివరించారు.
ఇదీ చదవండి: 20 ఏళ్ల పాత విమానాల దిగుమతికి డీజీసీఏ పరిశీలన