
అంతర్జాతీయంగా సరఫరా సమస్యల వల్ల విమానాల డెలివరీలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో 20 ఏళ్ల పాత విమానాలను దిగుమతి చేసుకునేందుకు అనుమతించే అంశాన్ని ఏవియేషన్ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ పరిశీలిస్తోంది. ఇందుకోసం సంబంధిత నిబంధనలను సడలించడంపై దృష్టి సారిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం ప్రెజరైజ్డ్ తరహా విమానాల దిగుమతికి 18 ఏళ్ల వరకు, అన్–ప్రెజరైజ్డ్ విమానాలకు 20 ఏళ్ల వరకు పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను వరుసగా 20 ఏళ్లు, 25 ఏళ్లకు పెంచాలని ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు అధికారి వివరించారు. 10,000 అడుగుల పైన అత్యధిక ఎత్తులో ప్రయాణించగలిగే విమానాలను ప్రెజరైజ్డ్ విమానాలుగా, అంతకన్నా దిగువన ప్రయాణించే విమానాలను అన్‌ప్రెజరైజ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వ్యవహరిస్తారు. దేశీయంగా షెడ్యుల్డ్, నాన్–షెడ్యూల్డ్ కార్యకలాపాల కోసం విమానయాన సంస్థలు లీజుకు తీసుకున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 800 పైచిలుకు ఉన్నాయి.
ఇటీవలి కాలంలో దేశీ విమానయాన సంస్థలు కార్యకలాపాలను విస్తరించేందుకు 1,400పైగా విమానాలకు ఆర్డర్లిచ్చాయి. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్ అయిన భారత్‌లో 2030 నాటికల్లా ప్యాసింజర్ల రద్దీ రెట్టింపై 50 కోట్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి.
ఇదీ చదవండి: శాశ్వత నివాసం కోసం ఐర్లాండ్ ఆకర్షణీయ మార్గం