
యూరప్‌లో నివసించాలని చూస్తున్నవారికి ఐర్లాండ్ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. యురోపియన్ యూనియన్‌యేతర జాతీయులు ఐర్లాండ్‌లో దీర్ఘకాలిక నివాసాన్ని ఏర్పరుచుకునేందుకు ఆకర్షణీయమైన మార్గాన్ని అందిస్తుంది. దీనికోసం దరఖాస్తు చేసేకునేందుకు భారతీయులు సైతం అర్హులని చెప్పింది. ఈ అవకాశం కోసం దరఖాస్తు రుసుము కేవలం 500 యూరోలు (సుమారు రూ.52,000) అని వెల్లడించింది.
ఐర్లాండ్‌లో శాశ్వత నివాసం
ఐర్లాండ్ శాశ్వత రెసిడెన్సీని అధికారికంగా లాంగ్-టర్మ్ రెసిడెన్సీ అని పిలుస్తారు. ఇది నాన్ ఈయూ/ ఈఈఏ(ఈయూతోపాటు ఐస్‌ల్యాండ్, లీచెన్‌స్టీన్, నార్వే) పౌరులు దేశంలో నివసించేందుకు అనుమతించే విధానం. ఇది దేశ పౌరసత్వం కానప్పటికీ, అనుమతులు అవసరం లేకుండా పనిచేసే హక్కు, ప్రజా సేవలకు అవకాశం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఐర్లాండ్‌లో ఐదు సంవత్సరాల చట్టపరమైన నివాసం తర్వాత నిబంధనల ప్రకారం ఈ హోదా ఇస్తారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?(భారతీయులు కూడా అర్హులు)
ఐర్లాండ్‌లో చట్టబద్ధంగా ఐదేళ్లు నివసించి, అక్కడ పనిచేసిన ఈయూ/ఈఈఏయేతన జాతీయులు ఈ కింది షరతులకు అనుగుణంగా స్థిర నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐర్లాండ్ లో ఐదు సంవత్సరాలు (60 నెలలు) నిరంతర చట్టపరమైన నివాసం ఉండాలి.
క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయిమెంట్ పర్మిట్ లేదా జనరల్ ఎంప్లాయిమెంట్ పర్మిట్ వంటి చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ ఉండాలి.
దరఖాస్తు సమయంలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారని ధ్రువీకరించుకోవాలి.
క్లీన్ క్రిమినల్ రికార్డ్ ఉండాలి.
ఆర్థిక స్వాతంత్ర్యం- ప్రజాధనంపై ఆధారపడకుండా మిమ్మల్ని మీరు పోషించుకునే సామర్థ్యం ఉండాలి.
ఐరిష్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పూర్తిగా పాటించాలి.
పర్మినెంట్ రెసిడెన్సీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్‌తో ఐదు సంవత్సరాల చట్టపరమైన నివాస అవసరాలను తెలియజేసేలా డాక్యుమెంటేషన్ తయారు చేయాలి.
రెసిడెన్సీ కోసం ఆ దేశ నిబంధనల ప్రకారం ఫారం 8ను పూర్తి చేయాలి.
పాస్‌పోర్ట్, ఐరిష్ రెసిడెన్స్ పర్మిట్ (ఐఆర్‌పీ) వివరాలు వెల్లడించాలి.
గత ఉపాధి అనుమతులు, పని చరిత్రను నివేదించాలి.
నిరంతర నివాసం కోసం రుజువులు చూపాలి.
అప్లికేషన్‌ను ఇమ్మిగ్రేషన్ సర్వీస్ డెలివరీ (ఐఎస్‌డీ)కి సబ్మిట్ చేయాలి.
అప్రూవల్ నోటీస్ అందుకున్న 28 రోజుల్లోగా 500 యూరోలు (సుమారు రూ.52,000) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ప్రాసెసింగ్ కోసం 6 నుంచి 8 నెలలు పట్టవచ్చు.
ఆమోదం పొందితే ఐర్లాండ్‌లో దీర్ఘకాలిక నివాసాన్ని ధ్రువీకరించే స్టాంప్ 4 వీసాను అందుకుంటారు.
ఇదీ చదవండి: మొదటిసారి అప్పు చేస్తున్నారా?