
అత్యవసరాలకు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కొన్నిసార్లు అప్పు చేయడం తప్పదు. అయితే అప్పు తీసుకోవాలనుకుంటే క్రెడిట్ స్కోర్ తప్పకుండా ఉండాలని చాలా మంది భావిస్తుంటారు. దాంతో మొదటిసారి అప్పు చేయాలంటే సిబిల్ లేదనే ఉద్దేశంతో బ్యాంకుల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా అప్పు చేసి అధిక వడ్డీలు చెల్లిస్తుంటారు. అలాంటి వారికోసం బ్యాంకులు ఇతర ప్రత్యామ్నాయ డేటాను ఉపయోగించి రుణాలు మంజూరు చేస్తున్నాయి. క్రెడిట్ హిస్టరీ లేని న్యూ-టు-క్రెడిట్ (ఎన్‌టీసీ) కస్టమర్లకు రుణాలను విస్తరించాలని బ్యాంకులను కోరిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా ఆదేశాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.
సంప్రదాయకంగా క్రెడిట్ బ్యూరో స్కోరు(సిబిల్) రుణ ఆమోదం ప్రక్రియలో కీలక నిర్ణయాంశంగా ఉంది. తగినంత లేదా క్రెడిట్ చరిత్ర లేకపోవడం వల్ల చాలా మంది రుణాలకు దూరంగా ఉంటున్నారు. అందులో కొందరు ఇతర మార్గాలు, అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని ఇబ్బందులు పడుతున్నారు. మొదటిసారి రుణాలు పొందేవారికి క్రెడిట్ హిస్టరీ ఉండదు కాబట్టి అలాంటి వారి రుణ అర్హతను అంచనా వేయడానికి బ్యాంకులు విస్తృత సూచికలను పాటిస్తున్నాయి.
ప్రత్యామ్నాయ డేటా వనరులు
ఎన్‌టీసీ కస్టమర్లకు రుణాలు మంజూరు చేయడానికి యుటిలిటీ పేమెంట్స్, మొబైల్, టెలికాం బిల్లులు, యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఈ-కామర్స్ బిహేవియర్ వంటి ప్రత్యామ్నాయ డేటా వనరులను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రజనీష్ కార్ణటక్ అన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి రుణగ్రహీతలకు 16 శాతం రుణాలను మాత్రమే బ్యాంకులు మంజూరు చేశాయని, మిగిలినవి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. ఈ వ్యత్యాసం రుణగ్రహీతలకు సంబంధించి నిర్మాణాత్మక డేటా అందుబాటులో లేకపోవడం వల్ల ఏర్పడిందని కార్ణటక్ తెలిపారు.
ఎన్‌టీసీ రుణగ్రహీతలకు మద్దతు
ప్రభుత్వం కూడా ఎన్‌టీసీ రుణగ్రహీతలకు మద్దతుగా నిలుస్తోంది. వీరికి రుణాలు ఇవ్వడానికి ఆర్‌బీఐ కనీస క్రెడిట్ స్కోర్‌ను తప్పనిసరి చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల స్పష్టం చేశారు. జనవరి 6, 2025 నాటి ఆర్‌బీఐ మాస్టర్ డైరెక్షన్‌ను ప్రస్తావిస్తూ ‘మొదటిసారి రుణగ్రహీతలకు క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు.. కాబట్టి వారి రుణ దరఖాస్తులను తిరస్కరించకూడదు’ అని చౌదరి నొక్కి చెప్పారు.
ఇదీ చదవండి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు చెక్ పెట్టాలి