
బ్యాంక్‌లకు సెబీ చీఫ్ పాండే సూచన
ఇన్‌సైడర్ ట్రేడింగ్ నియంత్రణలను పాటించడం బ్యాంకుల యాజమాన్యాల నైతిక బాధ్యత అని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే గుర్తు చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఉల్లంఘనలను గుర్తించి, నివారించేందుకు వీలుగా అంతర్గత నియంత్రణలను బలోపేతం చేసుకోవాలని సూచించారు.
‘అంతర్గత నియంత్రణలు బలహీనంగా ఉన్నప్పుడు, ప్రక్రియలు అస్పష్టంగా ఉన్నప్పుడు, బాధ్యతలను సరిగ్గా నిర్వచించనప్పుడు, పర్యవేక్షణ సరిగ్గా లేనప్పుడు ఇన్‌సైడర్ ట్రేడింగ్ రిస్క్ పెరుగుతుంది’ అని పాండే తెలిపారు. చాలా మోసాలకు అంతర్గత నియంత్రణలు బలహీనంగా ఉండడమే కారణమన్నారు. ఇండస్ ఇండ్ బ్యాంక్ మాజీ ఎండీ–సీఈవో, డిప్యూటీ సీఈవోలు బయటకు వెల్లడించని సున్నిత సమాచారం (యూపీఎస్‌ఐ) ఆధారంగా బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్ నిర్వహించినట్టు తేలుస్తూ, సెబీ ఇటీవలే చర్యలు ప్రకటించడం గమనార్హం. దీంతో సెబీ చైర్మన్ తాజా సూచనలకు ప్రాధాన్యం నెలకొంది.
అంతర్గతంగా బలమైన నియంత్రణలు ఏర్పాటు చేసుకోవడం, వెంటనే సమాచారాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించడం, తమ బాద్యతల పట్ల ఉద్యోగుల్లో స్పష్టమైన అవగాహన కల్పించడం ద్వారా ప్రతి సున్నిత సమాచారం విషయంలో జవాబుదారీ తనం ఉండేలా చూడొచ్చని అభిప్రాయపడ్డారు. సమావేశాల్లో సున్నిత సమాచారాన్ని అనధికారికంగా పంచుకోవడం, ఈమెయిల్ రూపంలో తెలియజేసినా దాన్ని ఉల్లంఘనగానే పరిగణించాలని పేర్కొన్నారు. ‘ఒక్కసారి సమచారం లీక్ అయితే సెకన్లలోనే డిజిటల్ నెట్‌వర్క్‌లపైకి చేరిపోతుంది. దాంతో స్టాక్ ధరలకు, ఇన్వెస్టర్ల విశ్వాసం, బ్యాంకు ప్రతిష్టకు జరిగే నష్టాన్ని భర్తీ చేయలేం’ అని పేర్కొన్నారు.