
న్యూఢిల్లీ: ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసిన ఆరోపణలపై సంస్థ మాజీ సీఈవో సుమంత్ కథ్పాలియాతో పాటు మరో నలుగురికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 19.78 కోట్ల జరిమానా విధించింది. అలాగే వారు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సెక్యూరిటీస్‌ను కొనడం, అమ్మడం లేదా ఇతరత్రా ఏ విధమైన లావాదేవీలు జరపరాదని స్పష్టం
చేసింది. నిషేధం ఎదుర్కొంటున్న మిగతావారిలో అప్పటి డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానా, ట్రెజరీ ఆపరేషన్స్ హెడ్ సుశాంత్ సౌరవ్, జీఎంజీ ఆపరేషన్స్ హెడ్ రోహన్ జఠన్న, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనిల్ మార్కో రావు ఉన్నారు. కీలక హోదాల్లో ఉన్న ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకి, సంస్థకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు, బైటికి రావడానికి ముందే తెలుస్తాయి. ఆ వివరాలను ఉపయోగించుకుని వీరు బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్ చేసి లబ్ధి పొందారని సెబీ విచారణలో వెల్లడైంది.