
బంగారం ధరలు స్టాక్ మార్కెట్‌తో పోటీపడుతూ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆకాశాన్నంటిన ధరలతో కొనుగోళ్లు లేక బంగారం వ్యాపారస్తులు డీలా పడుతున్నారు. శనివారం ధనత్రయోదశి నాడైనా వ్యాపారం కళకళలాడుతుందని బంగారు దుకాణాల యజమానులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.
వన్‌టౌన్(విజయవాడ): భారతీయ సంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక స్థానం. ఏ శుభకార్యం ఉన్నా బంగారం ప్రస్తావన లేకుండా ఆ కార్యక్రమం పూర్తి కాదు. ప్రజలు వారివారి స్థాయిలో ఎంతో కొంత బంగారం ఆభరణాలను కొనుగోలు చేసి తమ హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. అయితే గడిచిన కొన్ని మాసాలుగా బంగారం ధర ఊహించని స్థాయిలో పెరుగుతుండడంతో ఆ ప్రభావం వ్యాపారంపై పడింది. తత్ఫలితంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వందలాది బంగారు దుకాణాల్లో వ్యాపారం దారుణంగా పడిపోయిందని వ్యాపారులు వాపోతున్నారు.
రెండేళ్లలో రెట్టింపైన ధర..
దేశంలోనే విజయవాడ బంగారం విక్రయాలకు చాలా ముఖ్యమైన ప్రాంతంగా వ్యాపారులు చెబుతారు. ఇక్కడ వ్యాపారులు, బంగారం ఆభరణాలు చేసే కారి్మకుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఇక్కడ బంగారం ధరలో మార్పులు ఆయా వర్గాలను సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. విజయవాడలో 2023 అక్టోబర్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.60వేలు ఉండగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,450గా ఉంది. తాజాగా శుక్రవారం అదే 24 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర రూ. 1,35,000 కాగా 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.1,21,700గా ఉంది. గడిచిన వారం రోజు లుగా బంగారం పరుగులు పెడుతూనే ఉంది. కొద్దిగా తడబడినా పరుగులు కొనసాగిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో దిగజారిన వ్యాపారం
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రతి రోజూ 150 నుంచి 200 కిలోల బంగారం వ్యాపారం జరుగుతుందని అంచనా. విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో బంగారు ఆభరణాల విక్రేతలకు సంబంధించి కార్పొరేట్ సంస్థలుగా ఉన్న దుకాణాలు సుమారుగా 30 నుంచి 40 వరకూ పని చేస్తున్నాయి. ఇవి కాకుండా విజయవాడ పాతబస్తీ, రాజగోపాలాచారివీధి, గవర్నరుపేట, సత్యనారా యణపురం, పటమట, బందరురోడ్డు తదితర ప్రాంతాల్లో సుమారుగా 800 నుంచి వెయ్యి వరకూ దుకాణాలు కొనసాగుతున్నాయి. ఇవి కాకుండా ఉమ్మడి జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మరో మూడు నుంచి నాలుగు వందల వరకూ దుకాణాలు ఉన్నాయి. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1300 నుంచి 1500 దుకాణాల్లో వ్యాపారం జరుగుతోంది. మామూలు కొనుగోలు దారులు కాకుండా సుమారు 20 వేల మంది బంగారు ఆభరణాల తయారీ కార్మికులు కూడా భారీగానే బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. విజయవాడ నగరంలోని కార్పొరేట్, కొన్ని సంప్రదాయ దుకాణాల్లోనే 80 శాతం వ్యాపారం జరిగితే మిగిలిన దుకాణాల్లో పది నుంచి 20 శాతం వ్యాపారం జరుగుతుందని సంఘ నేతలు చెబుతున్నారు. అయితే గడిచిన కొద్ది మాసాలుగా వ్యాపారం భారీగా దిగజారిందని, పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ సగానికి పైగా పడిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాహాల సీజన్ ఉన్నా వ్యాపారం జరగకపోవటంపై వ్యాపారులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నా...
నగరంలోని పలు కార్పొరేట్ బంగారు ఆభరణాల దుకాణాలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నా వ్యాపారం జరగటం లేదని చెబుతున్నారు. ప్రధానంగా గ్రాముకు వాల్యూ యాడెడ్ చార్జీలు 10 నుంచి 30 శాతం వరకూ ఆయా ఆభరణాల రకా లను బట్టి వ్యాపారులు విధిస్తారు. అంటే గ్రాము 12 వేలు ఉంటే అత్యధికంగా రూ.3,600 వరకూ వీఏ పేరుతో చార్జీలను వ్యాపారులు వసూలు చేస్తారు. ఇది కాకుండా జీఎస్‌టీ ఉంటుంది. అయి తే తాజాగా వ్యాపారులు చాలా వరకూ ఈ వీఏ పేరుతో వసూలు చేసే చార్జీలను కొంతమంది సగానికి తగ్గించగా, మరికొంతమంది ఇంకా తగ్గించి ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరికొంతమంది వ్యాపారులు గ్రాముకు వంద నుంచి రూ.500 వరకూ తగ్గింపు ఇస్తామని ప్రకటిస్తున్నా.. వ్యాపారం జరగటం లేదని వాపోతున్నారు.
ధనత్రయోదశి సెంటిమెంట్ అయినా ఫలిస్తుందా..
బంగారం వ్యాపారులు ధనత్రయోదశిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల 18వ తేదీన ధనత్రయోదశి తిథి ఉన్నట్లుగా పండితులు చెబుతున్నారు. ధనత్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది అనే సెంటిమెంట్ బలంగా ఉంది. ఆ క్రమంలో గడిచిన దశాబ్ద కాలంగా బంగారం విక్రయాలు ధనత్రయోదశి రోజున నగరంలో భారీగా జరుగుతున్నాయి. వ్యాపారులు ఇప్పటికే ప్రత్యేకంగా ఆఫర్లను ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పెద్ద దుకాణాలు ఎలా ఉన్నా చిన్న వ్యాపారులు ధనత్రయోదశి రోజున ఎంతోకొంత వ్యాపారం పెరుగుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు.
వ్యాపారం దారుణంగా పడిపోయింది
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో వ్యాపారం భారీగా దిగజారిపోయింది. అసలే కార్పొరేట్ దుకాణాల తాకిడికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాధారణ వ్యాపారులకు ఈ ధరల పెరుగుదల గోరుచుట్టుపై రోకటి పోటులా తయారైంది. బంగారం ధరల పెరుగుదలతో చాలా దుకాణాల్లో రోజుల తరబడి బోణీ సైతం కాని పరిస్థితులు ఉన్నాయి. ధనత్రయోదశి, దీపావళి పండుగలను పురస్కరించుకుని అయినా వ్యాపారాలు కోలుకుంటాయని ఆశగా ఎదురు చూస్తున్నాం.
– కోన శ్రీహరి సత్యనారాయణ, అధ్యక్షుడు, ది బెజవాడ బులియన్
మర్చంట్స్ అసోసియేషన్