
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా డబ్బా ట్రేడింగ్ చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ అంశంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండవలసిందిగా హెచ్చరించింది. చట్ట విరుద్ధంగా జరిగే ట్రేడింగ్ సర్వీసుల ద్వారా ఎలాంటి లావాదేవీలు చేపట్టవద్దని సూచించింది. ఈ విషయంలో జాగరూకతతో వ్యవహరించవలసిందిగా పేర్కొంది.
స్టాక్ మార్కెట్లకు సమాంతరంగా నియంత్రణలులేని ఆఫ్‌మార్కెట్లో నిర్వహించే అక్రమ లావాదేవీలకు దూరంగా ఉండమంటూ హెచ్చరించింది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంబంధం లేకుండా నిర్వహించే ఇలాంటి లావాదేవీలు భారీ రిస్క్‌లతో కూడి ఉంటాయని తెలియజేసింది. అంతేకాకుండా సెక్యూరిటీస్ కాంట్రాక్టుల చట్టంలోని పలు నిబంధనల ఉల్లంఘనకు సైతం దారితీస్తాయని హెచ్చరించింది. వెరసి డబ్బా ట్రేడింగ్ చట్ట విరుద్ధమేకాకుండా.. రిస్క్‌లను సైతం ఎదుర్కోవలసి ఉంటుందని వివరించింది. నియంత్రణ, అవగాహన, చట్టబద్ధ సంస్థల సహకారంతో సెబీ ఇన్వెస్టర్ల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసింది.
ఇదీ చదవండి: రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలా
ఏమిటీ డబ్బా ట్రేడింగ్..
సెబీ నిర్వచించిన విధంగా డబ్బా ట్రేడింగ్ అనేది చట్టవిరుద్ధమైన, క్రమబద్ధీకరించని ఆఫ్ మార్కెట్ ట్రేడింగ్. ఇది గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నియంత్రణలో ఉండదు. సెబీ గుర్తింపు పొందిన ఏ ఎక్స్ఛేంజ్‌లోనూ ఈ ట్రేడులు నమోదు అవ్వవు. వ్యాపారులు, డబ్బా ఆపరేటర్ల మధ్య నగదు రూపంలో సెటిల్‌మెంట్లు జరుగుతాయి. ప్రధానంగా స్టాక్ ధర కదలికలపై బెట్టింగ్ వేస్తారు. సెక్యూరిటీల వాస్తవ కొనుగోలు లేదా అమ్మకం ఉండదు. వీటిని అనుసరించడం సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్, 1956, సెబీ యాక్ట్ 1992, భారతీయ న్యాయ్ సంహిత 2023ను ఉల్లంఘించడం అవుతుందని గుర్తుంచుకోవాలి.