
సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే
సోషల్ మీడియా వేదికలపై ఇన్వెస్టర్లను మోసగించే చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను గత 18 నెలల్లో లక్షకు పైగా తొలగించినట్టు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మోసగాళ్ల బారి నుంచి ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. చట్టవిరుద్ధమైన కంటెంట్ విషయాన్ని గూగుల్, మెటా తదితర ప్లాట్‌ఫామ్‌ల దృష్టికి తీసుకెళ్లి వాటిని తొలగించే దిశగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
ఎన్‌ఎస్‌ఈలో ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్ల అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మోసపూరిత కంటెంట్‌ను గుర్తించడంతో టెక్నాలజీ సాయపడుతున్నట్టు తెలిపారు. క్యాపిటల్ మార్కెట్లపై కేవలం 36 శాతం మందికే అధికంగా లేక మోస్తరు అవగాహన ఉందన్న ఇటీవలి సర్వే ఫలితాలను ప్రస్తావిస్తూ.. ఈ పరిస్థితుల్లో మోసపూరిత కంటెంట్ మెజారిటీ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే అవకాశం లేకపోలేదన్నారు.
‘విశ్వాసం దెబ్బతింటే అప్పుడు ఆర్థిక వ్యవస్థకు చోదకం కుంటుపడుతుంది. పెట్టుబడులకు ఇన్వెస్టర్లు వెనకాడతారు’అని పాండే పేర్కొన్నారు. అందుకే ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించడం సెబీకి కీలక ప్రాధాన్యంగా తెలిపారు. ఈ దిశగా ఎన్నో చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..