
భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ముందుంది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2% జీడీపీ వృద్ధిని సాధించింది. తయారీ, సేవల రంగాల్లో బలంగా ఉంది. అయితే దేశ సంపదకు మూలమైనవారు.. కంపెనీల వ్యవస్థాపకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు మాత్రం దేశాన్ని విడిచి వెళ్తున్నారు. తమ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నా తాము విదేశాల్లో స్థిరపడేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకు కొన్ని కారణాలను కోటక్-ఈవై సర్వే వెల్లడించింది.
భారతదేశం అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుంటే దాని సంపద సృష్టికర్తలు ఎందుకు నిష్క్రమిస్తున్నారనే దానిపై కోటక్ ఈవై నివేదిక రూపొందించింది. భారతీయ ధనవంతులు విదేశాలకు వలస వెళ్లడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నట్లు తెలిపింది.
మెరుగైన జీవన నాణ్యత, మౌలిక సదుపాయాలు
ప్రపంచంలోని 50 అత్యంత కలుషితమైన నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి. ఇది సంపన్న కుటుంబాలను సింగపూర్, ఆస్ట్రేలియా, యూరప్ వంటి సురక్షితమైన, సుసంపన్నమైన జీవన వాతావరణానికి ప్రేరేపించేలా చేస్తుంది.
ఆరోగ్య సంరక్షణ, విద్యా వ్యవస్థలు
భారతదేశం జీడీపీలో ప్రజారోగ్యం కోసం కేవలం 2.1%, విద్య కోసం 2.9% మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇది ప్రపంచ ప్రమాణాలైన 6% కంటే చాలా తక్కువ. దీని కారణంగా ధనవంతులు మెరుగైన ప్రైవేట్ సేవలు, ప్రపంచ స్థాయి విద్య కోసం యూఎస్‌ఏ, యూకే లేదా కెనడా వైపు మొగ్గు చూపుతున్నారు.
స్నేహపూర్వక పన్ను విధానాలు..
భారత్‌లో 42.74% అధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉంది. దుబాయ్‌లో సున్నా పన్ను. పోర్చుగల్‌లో పదేళ్ల పన్ను మినహాయింపులు ఆకర్షణీయంగా తోస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో 52 మిలియన్లకు పైగా కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండటం వలన పౌర వివాదాలు దశాబ్దాల పాటు సాగుతున్నాయి. ఇది వ్యాపారవేత్తలకు ఆమోదయోగ్యం కాని జాప్యాన్ని సూచిస్తుంది.
విదేశాల్లోని భారతీయులు
పేరు | స్థూల విలువ (రూ.కోట్లలో) | ప్రస్తుత ప్రదేశం |
---|---|---|
గోపీచంద్ హిందూజా & ఫ్యామిలీ | 1,85,310 | లండన్ |
లక్ష్మీ మిట్టల్ | 1,75,390 | లండన్ |
జే చౌదరి | 1,46,470 | శాన్ జోస్, అమెరికా |
అనిల్ అగర్వాల్ | 1,11,400 | లండన్ |
షాపూర్ పల్లోంజీ మిస్త్రీ, కుటుంబం | 88,650 | మొనాకో |
ప్రకాష్ లోహియా | 87,700 | లండన్ |
వివేక్ చాంద్ సెహగల్ | 57,060 | మెల్‌బోర్న్ |
జయశ్రీ ఉల్లాల్ | 50,170 | శాన్ ఫ్రాన్సిస్కో |
యూసఫ్ అలీ, ఎం.ఎ. | 46,300 | అబుదాబి |
రాకేష్ గంగ్వాల్ | 42,790 | మయామి, అమెరికా |
నీరవ్ మోదీ (యూకే), మెహుల్ చోక్సీ (ఆంటిగ్వా) వంటివారు పరారీలో ఉన్నారు. ఈ వజ్రాల వ్యాపారులు అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
దేశీయ పెట్టుబడుల బలహీనత
లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS-దేశం నుంచి విదేశాలకు వెళ్లే డబ్బు) కింద విదేశీ చెల్లింపులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 27.14 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు సంవత్సరం కంటే 38% పెరిగింది. ఈ మూలధనం విదేశీ రియల్ ఎస్టేట్, రెసిడెన్సీ కార్యక్రమాలకు మళ్లించబడుతుంది. ఇది దేశీయ వృద్ధికి ఉపయోగపడదు. దీనికి విరుద్ధంగా భారతదేశంలోకి ఎఫ్‌డీఐ 2022-23లో 84.8 బిలియన్ డాలర్ల నుంచి 71 బిలియన్ డాలర్లకు తగ్గింది.
2023లో 6,500 మంది మిలియనీర్లు భారతదేశాన్ని విడిచిపెట్టారని హెన్లీ & పార్టనర్స్ నివేదించింది. 2025 నాటికి ఈ సంఖ్య సంవత్సరానికి 8,000కి పెరగవచ్చని గతంలో అంచనా వేసింది. ఇది ప్రతిభతోపాటు సంపదను కోల్పోవడాన్ని సూచిస్తుంది.
ఇదీ చదవండి: ఛార్జీల నియంత్రణకు డీజీసీఏ చర్యలు