
దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో విమానయాన రంగంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు విపరీతంగా పెరగకుండా నిరోధించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక చర్యలు తీసుకుంటుంది. ప్రయాణికులకు సరసమైన ధరలు లభించేలా చూడటానికి దేశీయ విమానయాన సంస్థలు తమ విమాన సామర్థ్యాన్ని పెంచాలని రెగ్యులేటర్ ఆదేశించింది.
పండుగ కాలంలో టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు విమానయాన సంస్థలతో ఈ సమస్యను ముందుగానే చర్చించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన మార్గాల్లో విమాన ఛార్జీల పోకడలను సమీక్షించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అధిక డిమాండ్ ఉన్న దీపావళి, క్రిస్మస్ వంటి పండుగ సమయాల్లో ఛార్జీల హెచ్చుతగ్గులపై ప్రయాణికుల నుంచి ఇటీవల ఫిర్యాదుల పెరుగుతున్న దృష్ట్యా డీజీసీఏ ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.
భారతదేశంలో ‘ఓపెన్ స్కైస్ పాలసీ’ ప్రకారం విమానయాన సంస్థలకు తమ ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఛార్జీలు అసమానంగా పెరిగితే జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని అధికారులు స్పష్టం చేశారు. పండుగ సీజన్‌లో ప్రయాణీకుల ప్రయోజనాలను కాపాడటానికి విమాన ఛార్జీలు, విమాన సామర్థ్యాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని డీజీసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.
డీజీసీఏ సలహాకు అనుగుణంగా ప్రధాన విమానయాన సంస్థలు అదనపు విమానాలను మోహరిస్తున్నాయి. ఈ అదనపు విమానాలు అక్టోబర్, నవంబర్ నెలల్లో సేవలందించనున్నాయి. దేశంలో 64.2 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉన్న ఇండిగో 42 సెక్టార్లలో 730 అదనపు విమానాలను నడపనుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కలిసి 20 మార్గాల్లో సుమారు 486 విమానాలను జోడించనున్నాయి. స్పైస్ జెట్ 38 సెక్టార్లలో 546 అదనపు సేవలను మోహరించనుంది.
ఇదీ చదవండి: మేనేజర్ కావాలనే నాపై కక్ష కట్టాడు!