
వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్న బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇటీవల సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన కథనం వైరల్‌గా మారింది. రిక్రూట్‌మెంట్ సమయంలో పూర్తిస్థాయి వర్క్ ఫ్రం హోం అని చెప్పిన కంపెనీ సడెన్‌గా ఫిజికల్‌గా ఆఫీస్‌కు రావాలని ఆదేశించినట్లు అందులో రాసుకొచ్చారు. అయితే మేనేజర్ కావాలనే ఇలా తనను వేదిస్తున్నట్లు చెప్పారు. తాను ఉంటున్న ప్రాంతం ఆఫీస్‌కు 300 కి.మీ ఉండడంతో సదరు ఉద్యోగి తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.
‘రిక్రూట్‌మెంట్ సమయంలో పర్మనెంట్ వర్క్ ఫ్రం హోం అన్నారు. నేను కంపెనీలో చేరి ఇప్పటికి ఏడాది గడిచిపోయింది. నేను ప్రస్తుతం ఉంటున్న ప్రాంతం మా ఆఫీస్‌కు 300 కి.మీ. ఇప్పటివరకు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆఫీస్‌కు రమ్మనారు. కానీ ఇప్పడు నన్ను మేనేజర్ కావాలనే ప్రతివారం రమ్మంటున్నాడు. టీమ్ బిల్డింగ్, ఆఫీస్ సంస్కృతిని సంరక్షించడం అనేవి కారణంగా చెబుతున్నాడు. ఈ వ్యవహారంపై మేనేజర్‌తో మాట్లాడినా లాభం లేకుండా పోయింది. ఇది స్నేహపూర్వకమైన వృత్తిపరమైన సంబంధాన్ని ఘర్షణకు, ఒత్తిడికి తావిస్తుంది. మేనేజర్ ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉన్నత స్థాయి యాజమాన్యాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నాను. అదేసమయంలో కెరియర్ అవకాశాలు, టీమ్ రిలేషన్స్ దెబ్బతింటాయేమోనని ఆలోచలున్నాయి’ అని పోస్ట్‌లో తెలిపారు.
రెడిట్ ప్లాట్‌ఫామ్‌లో వెలసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఉద్యోగి పట్ల సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒక అనివార్య సమస్య అని పేర్కొన్నారు. ‘టీమ్ బిల్డింగ్’ లేదా ‘ఆఫీస్ సంస్కృతి’ని సంరక్షించడం అనే సాకుతో చాలామంది ఇలా ఉద్యోగులను ఇబ్బందిపెడుతున్నట్లు కొందరు చెప్పారు. కొంతమంది మేనేజర్లు తాము రిమోట్‌గా పని చేస్తూనే కింది సిబ్బందిని కార్యాలయానికి రావాలని బలవంతం చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: పెళ్లి నిధిని ఎలా సమకూర్చుకోవాలి?