
కుమార్తె వివాహ అవసరాల కోసం ప్రతి నెలా రూ.45,000 చొప్పున ఆరేళ్ల పాటు పెట్టుబడి చేయాలన్నది ప్రణాళిక. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – జి. దేవిగుప్తా
మన దేశంలో వివాహ వేడుకలన్నవి భారీ ఖర్చుతో కూడుకున్నవి. ప్రతి నెలా రూ.45,000 చొప్పున వచ్చే ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినట్టయితే గణనీయమైన మొత్తమే సమకూరుతుంది. వివాహం లక్ష్యం విషయంలో రాజీపడలేం. అనుకున్న సమయానికి కావాల్సినంత చేతికి అందాల్సిందే. కనుక రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకునే వారు తటస్థ మార్గాన్ని అనుసరించొచ్చు. ఇందులో భాగంగా 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి.
డెట్ విషయంలో షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులకు లార్జ్‌క్యాప్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే.. ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతాన్ని కేటాయించుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. బంగారం కోసం గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోనూ కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బంగారం విలువ పెరుగుదల రూపంలో రాబడి సమకూర్చుకోవచ్చు. వివాహ సమయంలో గోల్డ్ ఈటీఎఫ్‌లను విక్రయించి ఆభరణాలు కొనుగోలు చేసుకోవచ్చు.
నేను దీర్ఘకాలం కోసం స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనే నూరు శాతం ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది సరైనదేనా? – నిరంజన్ దాస్
స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు పెట్టుకునే ముందు దీర్ఘకాలం ఒక్కటే చూడకూడదు. మార్కెట్ దిద్దుబాట్లలో స్మాల్‌క్యాప్ పెట్టుబడుల గణనీయమైన కుదుపులకు లోనవుతుంటుంది. అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇవి మెరుగైన రాబడులను ఇవ్వగలవు. కనుక పెట్టుబడుల కోసం స్మాల్‌క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. కాకపోతే ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి కనుక, మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మించి స్మాల్‌క్యాప్ పథకాలకు కేటాయించుకోకపోవడమే మంచిది. చిన్న కంపెనీ దిగ్గజ కంపెనీగా మారిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో చిన్న కంపెనీల్లో సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువగా ఉంటుంది.
స్మాల్‌క్యాప్ కంపెనీల విషయానికొస్తే కావాల్సినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువే ఉంటుంది. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్ది విక్రయాలకే ఎక్కువ నష్టపోతుంటాయి. అందుకే మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్‌క్యాప్ కంపెనీల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో అయితే నేరుగా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే చిన్న కంపెనీల్లో ఏ ధరలో కొనుగోలు చేశారన్నది రాబడులను నిర్ణయిస్తుంది. పైగా ఈ విభాగంలో వైఫల్యాలు, మోసాల రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. నిపుణులైన ఫండ్ మేనేజర్లు వీటన్నింటినీ పరిశీలిస్తూ వేగంగా పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు అమలు చేస్తుంటారు. కనుక మొత్తం పెట్టుబడుల్లో స్మాల్‌క్యాప్ విభాగానికి పరిమితంగానే కేటాయింపులు చేసుకోవాలి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు.
ఇదీ చదవండి: వయసు 31.. సంపద రూ.21 వేలకోట్లు! ఎలా సాధ్యమైంది?
