వయసు 31.. సంపద రూ.21 వేలకోట్లు! ఎలా సాధ్యమైంది? | How Aravind Srinivas CEO Perplexity AI become India youngest billionaire | Sakshi
Sakshi News home page

వయసు 31.. సంపద రూ.21 వేలకోట్లు! ఎలా సాధ్యమైంది?

Oct 4 2025 3:03 PM | Updated on Oct 4 2025 3:03 PM

How Aravind Srinivas CEO Perplexity AI become India youngest billionaire

భారతదేశపు అతి పిన్న వయసున్న బిలియనీర్‌గా అరవింద్ శ్రీనివాస్(31)కు ప్రత్యేక గుర్తింపు లభించింది. చెన్నైలో జన్మించిన ఈయన పెర్‌ప్లెక్సిటీ ఏఐ సహ వ్యవస్థాపకుడిగా, ఆ సంస్థ సీఈఓగా ఉన్నారు. దాంతోపాటు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రూ.21,190 కోట్ల (సుమారు $2.5 బిలియన్లు) నికర విలువతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

తమిళనాడులోని చెన్నైలో పెరిగిన అరవింద్ శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. మెషిన్ లెర్నింగ్‌, ఏఐ పట్ల అభిరుచి పెంచుకున్నారు. తన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉన్నత విద్య కోసం యూఎస్‌ వెళ్లారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్క్‌లీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ సంపాదించారు. ఈ ప్రయాణంలో శ్రీనివాస్ తన నైపుణ్యాలను ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఏఐ సంస్థలతో కలిసి మెరుగుపరుచుకున్నారు. ఈ క్రమంలో OpenAI, గూగుల్, డీప్ మైండ్‌ల్లో పనిచేశారు. ఇక్కడ అతను అత్యాధునిక ఏఐ నమూనాలు, ఎల్‌ఎల్‌ఎం(లార్జ్‌ ల్యాంగ్వేజీ మోడల్స్‌)పై అనుభవం సాధించారు. ఇది అతని సొంత కంపెనీ స్థాపనకు కీలకంగా మారింది.

పెర్‌ప్లెక్సిటీ ఏఐ

2022లో శ్రీనివాస్ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్వినిస్క్‌తో కలిసి పెర్‌ప్లెక్సిటీ ఏఐను స్థాపించారు. ఇది సాధారణ సెర్చ్‌ ఇంజిన్ కాదు. ఇది ఒక ఇంటెరాక్షన్‌ ఏఐ సెర్చ్ ఇంజిన్. ఏదైనా ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి వేగవంతమైన మార్గంగా దీన్ని శ్రీనివాస్ అభివర్ణించారు. మార్కెట్‌లో తన పోటీదారులకు బలమైన ప్రత్యామ్నాయంగా పెర్‌ప్లెక్సిటీ నిలుస్తుంది. సంప్రదాయ సెర్చ్ ఇంజిన్ల మాదిరిగా హైపర్‌లింక్‌ల జాబితాను అందించడానికి బదులుగా పెర్‌ప్లెక్సిటీ ప్రత్యక్ష, ఇంటెరాక్షన్‌ సమాధానాలను అందిస్తుంది. ఇది మరింత కచ్చితమైన ప్రతిస్పందనలను రూపొందించడానికి జనరేటివ్ ఏఐను రియల్‌టైమ్‌ వెబ్ డేటాతో విలీనం చేస్తుంది. ఈ కంపెనీకి సిలికాన్ వ్యాలీలో గుర్తింపు లభించింది. ఈ స్టార్టప్‌కు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో సహా అగ్రశ్రేణి పెట్టుబడిదారుల నుంచి నిధులు సమకూరాయి.

ఇదీ చదవండి: సర్‌ క్రిక్‌ వివాదం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement