గ్లోబల్ టెక్ రంగంలో అత్యంత ధనవంతులైన భారతీయ సంతతికి చెందినవారు ఎవరనే ప్రశ్నకు.. చాలామంది సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ పేర్లు చెబుతారు. అయితే హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. అత్యంత ధనవంతులైన భారతీయ ప్రొఫెషనల్ మేనేజర్ ఆర్టిస్టా నెట్‌వర్క్స్ సీఈఓ & చైర్‌పర్సన్ జయశ్రీ ఉల్లాల్ అని తెలిసింది.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. భారతీయ ప్రొఫెషనల్ మేనేజర్లలో అగ్రస్థానంలో నిలిచిన జయశ్రీ ఉల్లాల్ నికర విలువ రూ.50,170 కోట్లు. కాగా.. సత్య నాదెళ్ల రూ. 9,770 కోట్ల నికర విలువతో రెండవ స్థానంలో, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రూ. 5,810 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, పెప్సికో మాజీ చీఫ్ ఇంద్రా నూయి, అడోబ్ శాంతను నారాయణ్, బెర్క్‌షైర్ హాత్వే అజిత్ జైన్ వంటి వారు ఉన్నారు.
2008 నుంచి ఆ కంపెనీకి నాయకత్వం
జయశ్రీ ఉల్లాల్ అమెరికాకు చెందిన కంప్యూటర్ నెట్‌వర్కింగ్ కంపెనీ అరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్ & సీఈఓ. ఈమె క్లౌడ్ అండ్ డేటా సెంటర్ టెక్నాలజీలో కీలక పాత్ర పోషించారు. 2008 నుంచి ఆ కంపెనీకి నాయకత్వం వహిస్తూ.. ముందుకు సాగుతున్నారు.
అరిస్టా నెట్‌వర్క్స్ విలువ గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూనే ఉంది. 2024లోనే ఈ సంస్థ దాదాపు 7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే దాదాపు 20 శాతం ఎక్కువ అని ఫోర్బ్స్ తెలిపింది. అరిస్టా స్టాక్‌లో ఉల్లాల్ దాదాపు 3 శాతం వాటాను కలిగి ఉన్నారు, ఇది ఆమె వ్యక్తిగత సంపదలో అతిపెద్ద భాగం అనే చెప్పాలి.
1961లో జననం
1961 మార్చి 27న లండన్‌లో భారతీయ సంతతికి చెందిన హిందూ కుటుంబంలో జన్మించిన ఈమె.. ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. కానీ చిన్నప్పుడు న్యూఢిల్లీలో పెరిగి అక్కడే జీసస్ అండ్ మేరీ కాన్వెంట్‌లో తన స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత చదువంతా అమెరికాలోనే సాగింది. అక్కడ ఆమె శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి.. ఆ తరువాత శాంటా క్లారా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.
చదువు పూర్తయిన తరువాత.. ఉల్లాల్ సెమీకండక్టర్ విభాగంలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఫెయిర్‌చైల్డ్ సెమీకండక్టర్, అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్‌లో పనిచేశారు. అక్కడ ఐబీఎం, హిటాచీ వంటి కంపెనీల కోసం హై-స్పీడ్ మెమరీ చిప్‌లను రూపొందించారు. 1980ల చివరలో.. 1990ల ప్రారంభంలో, ఆమె నెట్‌వర్కింగ్‌లోకి అడుగుపెట్టి, ఉంగర్మాన్-బాస్‌లో.. ఆ తరువాత క్రెసెండో కమ్యూనికేషన్స్‌లో చేరారు. క్రెసెండోలో చేరిన ప్రారంభ రోజుల్లో ఈమె ఈథర్నెట్ స్విచింగ్ టెక్నాలజీలపై పనిచేశారు.
సిస్కోలో ఉల్లాల్
1993లో సిస్కో సిస్టమ్స్ క్రెసెండో కమ్యూనికేషన్స్‌ను కొనుగోలు చేసినప్పుడు జయశ్రీ ఉల్లాల్ కెరీర్‌లో పెద్ద మలుపు తిరిగింది. ఆ కొనుగోలు ఉల్లాల్‌ను సిస్కోలోకి తీసుకువచ్చింది. ఇక్కడే 15 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేశారు. కాలక్రమేణా.. ఆమె సిస్కో డేటా సెంటర్‌కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు.
2008లో అరిస్టా నెట్‌వర్క్స్ వ్యవస్థాపకులు ఆండీ బెచ్టోల్షీమ్ & డేవిడ్ చెరిటన్ ఆమెకు కంపెనీ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. ఆమె నాయకత్వంలో, అరిస్టా సిలికాన్ వ్యాలీ యొక్క అత్యంత విజయవంతమైన నెట్‌వర్కింగ్ సంస్థలలో ఒకటిగా మారింది. 2014లో, ఆమె కంపెనీని న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో పబ్లిక్ లిస్టింగ్‌కు తీసుకెళ్లింది. దీంతో ఫోర్బ్స్ ఆమెను నెట్‌వర్కింగ్ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. ఆమె బారన్ ప్రపంచంలోని ఉత్తమ సీఈఓల జాబితాలో.. ఫార్చ్యూన్ టాప్ గ్లోబల్ బిజినెస్ లీడర్స్ జాబితాలో కూడా చోటు సంపాదించింది.


