కడప జెడ్పీ సీఈవోను నిలదీసిన హైకోర్టు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం, రవాణా భత్యం, కరువు భత్యం వంటి బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని జెడ్పీ సీఈవోను హైకోర్టు నిలదీసింది. ఒక్కో సభ్యునికి రూ.2.10 లక్షల చొప్పున బకాయిలు చెల్లించాల్సి ఉందని, వీటిని చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కడప జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల చెన్నయ్య, మరో 26 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి సోమవారం మరోసారి విచారణ జరిపారు.
ఈ నేపథ్యంలో జెడ్పీ సీఈవో ఓ మెమోను కోర్టు ముందుంచారు. ఆ వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లింపు విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఈవోను ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు సకాలంలో వేతనాలు అందుతున్నాయన్నారు. కానీ పిటిషనర్లకు మాత్రం గౌరవ వేతనం, ఇతర భత్యాలను చెల్లించడం లేదని, ఈ విషయంలో నిర్ధిష్ట గడువు విధించాలని కోర్టును అభ్యర్థించారు.


