ఎయిరిండియాకు కొత్త సీఈవోను నియమించే దిశగా టాటా గ్రూప్ అన్వేషణ ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ పదవీ కాలం 2027 జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అలాగే తక్కువ ఖర్చుతో సేవలు అందించే అనుబంధ సంస్థ ‘ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్’ కొత్త ఎండీ నియామకంపైనా టాటా గ్రూప్ దృష్టి సారించినట్లు తెలిసింది.
‘‘2027 తర్వాత ఒప్పందాన్ని పొడిగించాలనే ఉద్దేశం విల్సన్‌కూ, టాటా గ్రూప్‌కూ లేదు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని సీఈవోగా చేయాలని టాటాసన్స్ భావిస్తోంది. అందులో భాగంగా ఎయిరిండియాకు బాధ్యతలు చేపట్టగలిగే సామర్థ్యం కలిగిన అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు’’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా బోయింగ్ 787–8 ప్రమాదానికి సంబంధించిన తుది నివేదిక జూన్ నాటికి వెలువడే అవకాశం ఉందని సమాచారం. కాగా, టాటా హౌస్‌లో సోమవారం జరిగిన ఓ అధికారిక సమావేశానికి క్యాంప్‌బెల్ విల్సన్ హాజరు కావడం గమనార్హం.


