
ఈ ఏడాది ధంతేరస్ (ధనత్రయోదశి) సందర్భంగా భారతీయ వినియోగదారులు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వ్యాపారుల సంఘం శనివారం తెలిపింది. బంగారం, వెండి ధరలు బాగా పెరిగినప్పటికీ.. సుమారు 60,000 కోట్ల రూపాయలు వీటికోసం ఖర్చు చేసినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా. ఈ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 25% ఎక్కువ.
బంగారం ధరలు గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 60 శాతం పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు దాటేసింది. ధరలు పెరిగినప్పటికీ.. సెంటిమెంట్, డిమాండ్ రెండూ కలిసొచ్చాయని సీఏఐటీ ఆభరణాల విభాగం, ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా అన్నారు. ఢిల్లీ బులియన్ మార్కెట్లలో మాత్రమే రూ. 10,000 కోట్లకు పైగా అమ్మకాలు నమోదయ్యాయని ఆయన అన్నారు.
ధంతేరస్, దీపావళి సమయంలో బంగారం కొనుగోలు శుభప్రదమని చాలామంది భావిస్తారు. ఈ కారణంగా ప్రతిఏటా ఈ పండుగల సమయంలో బంగారం అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా భారీగా పెరిగి.. కేజీ వెండి రేటు సుమారు రూ. 2 లక్షలు దాటేసింది. ఈ రేటు ఇందుకు ముందు ఏడాదితో పోలిస్తే.. 55 శాతం ఎక్కువ.
బంగారం, వెండి అమ్మకాలు కాకుండా.. వంట సామాగ్రి అమ్మకాలు రూ.15,000 కోట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వస్తువులు రూ.10,000 కోట్లు, అలంకరణ.. మతపరమైన వస్తువుల అమ్మకాలు రూ.3,000 కోట్లుగా ఉన్నాయని వ్యాపారుల సంఘం తెలిపింది.
ఇదీ చదవండి: గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్
ధన్‌తేరస్ కొనుగోలు పెరుగులపై.. సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, జీఎస్టీ రేట్లలో తగ్గింపులు, స్థానికంగా తయారైన ఉత్పత్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహం అందించడం వల్ల పండుగల సమయంలో వ్యాపారాలు పెరగడానికి దోహదపడ్డాయని అన్నారు. సాంప్రదాయ మార్కెట్లు, స్థానిక ఆభరణాల స్టోర్స్.. రిటైల్ దుకాణాలు రికార్డు స్థాయిలో కస్టమర్ల రద్దీని నమోదు చేశాయని పేర్కొన్నారు.