
బంగారం ధరల పెరుగుదల తగ్గే సూచనలు కనిపించడం లేదు. 2025 ప్రారంభం నుంచి ఇప్పటికే దాదాపు 50 శాతం పెరిగిన గోల్డ్ రేటు.. 2022 ధరలతో పోలిస్తే 140 శాతం ఎక్కువని స్పష్టమవుతోంది. ప్రస్తుత పరిస్థితులు పసిడి ధరలను మరింత పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం రాబోయే ధంతేరాస్ (ధనత్రయోదశి), దీపావళి.
ధంతేరాస్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పండుగ సమయంలో గోల్డ్ రేటు భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. 2026 ప్రారంభం నాటికి ఈ ధర రూ. 1.50 లక్షలు అవుతుందని అంచనా వేస్తున్నారు.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో.. ఈ వారం బంగారం ధరలు ఇప్పటికే 10 గ్రాములకు రూ. 1,22,284 వరకు పెరిగాయి. రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్‌లో SVP-రీసెర్చ్ అజిత్ మిశ్రా ప్రకారం.. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు వంటివన్నీ గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతున్నాయి.
ఇదీ చదవండి: కొత్త రేటుకు వెండి: రాబర్ట్ కియోసాకి
ఈ రోజు (అక్టోబర్ 14) విజయవాడలో బంగారం రేటు గరిష్టంగా రూ. 2950 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,28,350 వద్దకు చేరింది. 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 2700 పెరిగి.. రూ. 1,17,650 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే.. గోల్డ్ రేటు ధంతేరాస్ నాటికంటే ముందే రూ. 1.35 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.