
అనంతపురం: ఓలా ఈ–బైక్ కంపెనీకి జిల్లా వినియోగదారుల కమిషనర్ జరిమానా విధించింది. వివరాలు.. కళ్యాణదుర్గం మండలం బత్తువానిపల్లి గ్రామానికి చెందిన పోలవరపు నాగరాజు 2024 ఏప్రిల్ 19న తన రూపే క్రెడిట్ కార్డు ద్వారా రూ.80,449 మొత్తాన్ని ‘ఓలా ఈ–బైక్’ కొనుగోలు నిమిత్తం చెల్లించాడు. కళ్యాణదుర్గం స్టేట్ బ్యాంకు జారీ చేసిన క్రెడిట్ కార్డు ద్వారా ఈ మొత్తాన్ని వారికి జమ చేశాడు. అయితే, ఓలా కంపెనీ వారు బైక్‌ను ఇవ్వకపోగా ఫోన్ కాల్స్, ఈ–మెయిల్స్‌కు కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో 2024 అక్టోబర్ 18న ఓలా ఈ–బైక్ కంపెనీకి నాగరాజు లీగల్ నోటీసులు పంపాడు.
వినియోగదారుల కమిషన్‌లో కేసు నమోదు చేశాడు. ఈ క్రమంలో ఓలా కంపెనీ ప్రతినిధులు కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తమకు ఎలాంటి మొత్తం చెల్లించలేదని, ఆన్‌లైన్ ద్వారా చెల్లింపు విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని కంపెనీ తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే, స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా వారి వివరాల మేరకు ఓలా కంపెనీకి నాగరాజు నగదు చెల్లించినట్లు నిర్ధారణ కావడంతో వినియోగదారుల కమిషన్ ఫిర్యాదుదారు వాదనలతో ఏకీభవించింది. డబ్బు వెనక్కి చెల్లించకపోవడం, బైక్ ఇవ్వకపోవడాన్ని సేవాలోపంగా పరిగణించింది.
ఫిర్యాదుదారు చెల్లించిన రూ. 80,449 మొత్తానికి 9 శాతం వార్షిక వడ్డీతో 2024 ఏప్రిల్ 19వ తేదీ నుంచి చెల్లించాలని తీర్పు వెలువరించింది. అలాగే, మానసిక వేదనకు పరిహారంగా రూ.20 వేలు, కోర్టు ఖర్చులు రూ.5 వేల చొప్పున మొత్తం సొమ్మును 45 రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది. వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు ఎం. శ్రీలత, సభ్యులు గ్రేస్‌మేరీ, బి. గోపీనాథ్‌ల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు సేవా లోపం లేదని నిర్ధారణ కావడంతో ఎస్‌బీఐపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.