
కోటక్ మహీంద్రా ఏఎంసీ కొత్తగా గోల్డ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) అక్టోబర్ 20తో ముగుస్తుంది. కనీసం రూ. 100 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ప్రధానంగా కోటక్ గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF), కోటక్ సిల్వర్ ఈటీఎఫ్ (Silver ETF)యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది.
బంగారం, వెండిలో పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తూ, దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి ప్రయోజనాలను అందించడం ఈ ఫండ్ లక్ష్యమని సంస్థ ఎండీ నీలేష్ షా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని, పరిశ్రమల్లో వెండి వాడకం పెరుగుతోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రెండింటి వృద్ధి ప్రయోజనాలను పొందేందుకు ఈ ఫండ్ అనువుగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇన్వెస్కో ఇండియా కన్జంప్షన్ ఫండ్
దేశీయంగా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా కన్జంప్షన్ ఫండ్‌ని (Invesco India Consumption Fund) ప్రవేశపెట్టింది ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ అక్టోబర్ 17 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. రోజువారీ సిప్ రూపంలో అయితే కనీసం రూ. 100, నెలవారీ అయితే రూ. 500 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు.
వినియోగం థీమ్‌తో ప్రయోజనం పొందే కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సాధనాల్లో కనీసం 80% ఇన్వెస్ట్ చేస్తుంది. మనీష్ బొద్దార్, అమిత్ గణాత్రా ఫండ్ మేనేజర్లుగా ఉంటారు. ట్యాక్స్ శ్లాబులు మార్చడం, జీఎస్‌టీ సంస్కరణలు మొదలైనవి వినియోగానికి మరింతగా ఊతమిస్తాయని సంస్థ సీఈవో సౌరభ్ నానావటి తెలిపారు.