ఢిల్లీలో రూ.1,33,200
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి ధర సోమవారం 10 గ్రాములకు రూ.3,040 పెరిగి రూ.1,33,200కు చేరింది. ఇటీవలే నమోదైన జీవితకాల గరిష్ట ధర రూ.1,34,800కు చేరువైంది. మరో రూ.600కు పైగా పెరిగితే పసిడి ధరల్లో కొత్త రికార్డు నమోదు కానుంది. ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండడంతో డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నట్టు, ఇది ధరలకు మద్దతునిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వెండి ధర సైతం వరుసగా ఐదో రోజు ర్యాలీ చేసింది. కిలోకి రూ.5,800 పెరిగి రూ.1,77,000కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 42 డాలర్లు ఎగసి (ఒక శాతం) 4,262.52 డాలర్ల స్థాయిని అందుకుంది. వెండి ధర (స్పాట్ మార్కెట్) ఔన్స్‌కి 3 శాతానికిపైగా ర్యాలీ చేసి 59 డాలర్లకు చేరింది. గత వారం రోజుల్లోనే వెండి ధర 16.7 శాతం పెరగడం గమనార్హం. అంతేకాదు 2025లో వెండి ధర రెట్టింపైంది. 2024 డిసెంబర్ 31న ఔన్స్ ధర 28.97 డాలర్ల వద్ద ఉంది. ‘‘యూఎస్ డాలర్ బలహీనపడడం, యూఎస్ ఫెడ్ వచ్చే వారంలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు పెరగడం, సెంట్రల్ బ్యాంకుల నుంచి పసిడి కొనుగోళ్లు బలంగా కొనసాగుతుండడం ధరలను మరింత గరిష్టాల దిశగా నడిపిస్తోంది’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.


