ఒక్కోసారి కొంతమంది చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద విజయంగా మారుతుంటాయి. స్మార్ట్ ఫోన్ వాడకంతో విసిగిపోయి తాను సొంతంగా స్క్రీన్ టైమ్ను తగ్గించుకుందామని ఓ టెకీ చేసిన చిన్నపాటి ప్రయోగం.. ఆమెకి అద్భుతమైన వ్యాపార అవకాశంగా మారింది. కేవలం మూడు రోజుల్లోనే ఆమె ఉత్పత్తి 120,000 డాలర్ల (సుమారు రూ.కోటి) అమ్మకాలను నమోదు చేసింది.
రెండేళ్ల క్రితం, ఆన్‌లైన్‌లో క్యాట్జీపీటీ (CatGPT) ఏర్పాటుతో గుర్తింపు పొందిన క్యాట్ గోయెట్జ్.. నిరంతర స్మార్ట్‌ఫోన్ వినియోగంతో విసిగిపోయి, పాతకాలపు ల్యాండ్‌లైన్ ఫోన్ వినియోగం వైపు మళ్లాలనుకుంది. అయితే ల్యాండ్‌లైన్ ఫోన్ వాడాలంటే కొత్త నంబర్, కనెక్షన్ కావాలి. దీంతో పాతకాలపు పింక్ క్లామ్‌షెల్ హ్యాండ్‌సెట్‌ను తీసుకుని, దాన్ని బ్లూటూత్తో స్మార్ట్ఫోన్లకు కనెక్ట్ చేసుకుని కాల్స్ మాట్లాడుకునేలా మార్పులు చేసింది. ఇది ఆమె అపార్ట్‌మెంట్‌లో ఒక వినూత్న ఆకర్షణగా మారింది.
తర్వాత జూలై 2025లో ఆమె ఈ పరికరం గురించి ఆన్లైన్‌లో షేర్ చేయగా అనూహ్య స్పందన వచ్చింది. ఇలాంటిది తమకు కూడా కావాలని వందలాది మంది కామెంట్ పెట్టారు. దీంతో ఆమె వీటికి ‘ఫిజికల్ ఫోన్’ అని పేరు పెట్టి ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఏదో 15–20 ప్రీ–ఆర్డర్లు వస్తాయని భావిస్తే.. అంచనాలను మించి, మూడే రోజుల్లోనే అమ్మకాలు 120,000 డాలర్లు దాటాయి. అక్టోబర్ చివరి నాటికి 3,000 యూనిట్లు అమ్ముడవగా, మొత్తం ఆదాయం 280,000 డాలర్లను దాటింది.
ఫిజికల్ ఫోన్లు ఎలా పనిచేస్తాయంటే..
ప్రస్తుతం ఫిజికల్ ఫోన్స్ బ్రాండ్ కింద 90–110 డాలర్ల ధరల్లో ఐదు రకాల హ్యాండ్‌సెట్ డిజైన్లు లభిస్తున్నాయి. ఉత్పత్తి పెరిగిన దృష్ట్యా, గోయెట్జ్ ఒక ఎలక్ట్రానిక్స్ తయారీదారుతో భాగస్వామ్యం చేసుకుని డిసెంబరు నుండి మొదటి బ్యాచ్ ఉత్పత్తుల షిప్పింగ్ని ప్రారంభించనుంది.
ఈ ఫిజికల్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా ఐఫోన్, ఆండ్రాయిడ్ పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఫేస్‌టైమ్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి యాప్స్ నుంచి వచ్చే కాల్స్‌ను ఇందులో మాట్లాడవచ్చు. నంబర్‌ను డయల్ చేయడం ద్వారా లేదా ‘స్టార్’(*) కీని నొక్కి ఫోన్‌లోని వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా అవుట్‌గోయింగ్ కాల్స్ కూడా చేయవచ్చు.


