breaking news
Land Line phone
-
కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలు షురూ
జమ్మూ: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధించిన ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ల్యాండ్‌లైన్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగానికి ఇప్పటికే కేంద్రం అనుమతులివ్వగా.. 5 నెలల తర్వాత శనివారం కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ సర్వీసులను పునరుద్ధరించారు. 2జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలనూ పునరుద్ధరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పోస్ట్‌పెయిడ్ మొబైల్ కనెక్షన్లపై 2జీ ఇంటర్నెట్ సేవలను కశ్మీర్‌లోని బండిపోరా, కుప్వారా జిల్లాలకు మాత్రమే పరిమితం చేశారు. దీంతోపాటు కొన్ని పరిమితులతో సాఫ్ట్వేర్ సర్వీసులు అందించే కంపెనీలకు ల్యాండ్ లైన్ ద్వారా ఇంటర్నెట్ పొందే అవకాశాన్ని కల్పించినట్లు జమ్మూకశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సల్ తెలిపారు. ‘ ఆంక్షల పాక్షిక సడలింపు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని టెలికం సంస్థలకు సూచించాం. అన్ని భద్రత, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పాం’ అని ఆయన అన్నారు. ఈ ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్లకు ఇంటర్నెట్ సౌకర్యం ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు టెలికం సంస్థలు వినియోగదారుల వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుందని రోహిత్ చెప్పారు. గత ఏడాది ఆగస్టు నుంచి జమ్మూ కశ్మీర్లో టెలికామ్ సేవలను ఆపేయగా.. సుప్రీంకోర్టు వారం క్రితం వ్యక్తం చేసిన అభ్యంతరాలతో తాజాగా ఆంక్షల తగ్గింపు మొదలైంది. ‘శనివారం నుంచి వాయిస్, ఎస్ఎంఎస్ సర్వీసులను పునరుద్ధరిస్తూ సంబంధిత అధికారి ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్ మొత్తమ్మీద ప్రీపెయిడ్ సిమ్‌కార్డుల్లో ఇకపై ఈ సేవలు అందుబాటులోకొస్తాయి’ అని రోహిత్ వివరించారు. -
ఫోన్ ఎత్తగానే.. ప్రాణాలు పోయాయి
మార్టూరు : రింగైన ల్యాండ్ లైన్ ఫోన్ ఎత్తగానే విద్యుదాఘాతానికి గురై ఓ ఇంటి యజమాని మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని బొబ్బేపల్లిలో శుక్రవారం వేకువ జామున జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన దండా మారుతీరావు(54) ఇంట్లో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ ఉంది. అందరూ నిద్రపోతుండగా వేకువ జామున ఫోన్ మోగింది. మారుతీరావు ఫోన్ ఎత్తటంతో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య పార్వతి, కుమారుడు కృష్ణచైతన్య, కుమార్తె అనిత ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి మృతుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అజయ్‌కుమార్ తెలిపారు. ఇదీ.. కారణం టెలిఫోన్ తీగల మీదగా విద్యుత్ తీగలు కూడా మారుతీరావు ఇంటికి వ్యాపించి ఉన్నాయి. మెయిన్ లైన్ విద్యుత్ తీగల సేఫ్టీ కోసం ఇంటి ముందు వరకు ప్లాస్టిక్ గొట్టాలు తొడిగారు. అయినా విద్యుత్ తీగలకు టెలిఫోన్ వైరులోని రాగి వైరు తగలటంతో టెలిఫోన్ తీగలకు విద్యుత్ ప్రసారమైంది. ఫలితంగా ఫోన్ లిఫ్ట్ చేసిన మారుతీరావు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.