
శిశువును ఖననం చేస్తున్న దృశ్యం
అనంతపురం శిశుగృహలో విషాదం
అనంతపురం సెంట్రల్: అనంతపురంలోని మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహలో దయనీయ పరిస్థితి చోటు చేసుకుంది. సక్రమంగా పాలు పట్టకపోవడంతో తీవ్ర అనారోగ్యంపాలైన ఓ నవజాత శిశువు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శిశుగృహ, ఐసీడీఎస్ సిబ్బంది శిశువును ఖననం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఐసీడీఎస్ అధికారుల కథనం మేరకు.. 20 రోజుల క్రితం కళ్యాణదుర్గానికి చెందిన మహిళ మగబిడ్డకు జన్మనిచ్చి, ధర్మవరం వెళ్లే రోడ్డులోని ముళ్లపొదల్లో వదిలేసింది.
స్థానికులు గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని శిశుగృహకు అప్పగించారు. 2 రోజుల పాటు పాలు సక్రమంగా అందించకపోవడంతో దసరా రోజు అనారోగ్యం పాలైనట్లు సమాచారం. గురువారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో శిశువును చూసుకునే ఆయా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే పసిబిడ్డ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన గురించి ఐసీడీఎస్ ఉన్నతాధికారులకు, చైల్
వెల్ఫేర్ కమిటీ సభ్యులకు తెలియజేయకుండానే కాంట్రాక్టు సిబ్బందే ఖననం చేసేశారు.
చిన్నారి అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందగా, అదే రోజు ఖననం చేశారని అనంతపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగమణి తెలిపారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో.. నీ వల్లే అంటూ ఇద్దరు మహిళా సిబ్బంది ఒకర్నొకరు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు.
నిర్లక్ష్యంతోనే పసివాడి ఆకలిచావు
కాగా, శిశువు మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. అనాథలు, పోషణ భారంగా మారిన వారి చిన్నారుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శిశుగృహను నిర్వహిస్తోంది. ఇక్కడ గ్రూపు తగాదాల కారణంగా కొంతకాలంగా సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదు. శుక్రవారం ఇద్దరు ఆయాలు పనిచేయగా.. రాత్రి రావాల్సిన ఇద్దరు ఆయాల్లో ఒకరు సెలవు పెట్టారు. దీంతో పాల కోసం చాలాసేపు ఏడ్చిన శిశువు చివరకు అర్ధరాత్రి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. విధుల్లో ఉన్న ఆయా ఆ చిన్నారిని తీసుకొని ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. ఆమె ఆస్పత్రికి వెళ్లేలోగానే దారిమధ్యలోనే ఈ చిన్నారి ప్రాణాలు వదిలింది.