
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. తాడిపత్రిలో ఉద్రిక్తతలు అంటూ చూపొద్దంటూ మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. ఈసారి అలా రాస్తే.. మీ ఇళ్ల వద్దకు వస్తానంటూ జేసీ బెదిరింపులకు దిగారు. ‘‘నా దగ్గర తమాషాలు చేయొద్దు.. నా గురించి అందరికీ తెలుసు.. మీడియా వాళ్లకు తప్పా?’’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.
తాడిపత్రిలో రోడ్డుపై పడుకుని జేసీ హల్‌చల్
కాగా, జేసీ ప్రభాకర్‌రెడ్డి నిన్న (సోమవారం) కూడా హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. పోలీస్ అధికారులను బెదిరించే ధోరణిలో స్థానిక ఏఎస్పీ కార్యాలయం ఎదుట, అశోక్ పిల్లర్ సర్కిల్లో దాదాపు ఐదు గంటల పాటు మంచంపై పడుకుని నిరసన పేరిట హంగామా సృష్టించారు. పది రోజుల క్రితం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏఎస్పీ రోహిత్‌కుమార్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి అందజేశారు.
దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదంటూ సోమవారం నేరుగా ఏఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని ఏఎస్పీతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇందుకు ఏఎస్పీ సుముఖంగా లేకపోవడంతో కార్యాలయం ముందు రోడ్డుపై పడుకుని హంగామా చేశారు. అయినప్పటికీ ఏఎస్పీ పట్టించుకోకపోవడంతో పట్టణంలోని అశోక్‌పిల్లర్ సర్కిల్‌కు చేరుకుని నడిరోడ్డుపై కుర్చీలో కూర్చొన్నారు. అయినా పోలీసుల నుంచి స్పందన కరువవడంతో అప్పటికప్పుడు రోడ్డుపై టెంట్ వేయించి.. మంచంపై పడుకున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయన హైడ్రామా కొనసాగింది. చివరకు జిల్లా ఎస్పీ నుంచి ఫోన్ రావడంతో వెనక్కి తగ్గారు.
