సాక్షి, అనంతపురం: ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ర్యాలీల నేపథ్యంలో తాడిపత్రిలో హైడ్రామా నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనకు పోటీగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.
వివరాల ప్రకారం.. తాడిపత్రిలో అధికార టీడీపీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ర్యాలీల సమయంలోనే పోటీగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమానికి తెర లేపారు. అభివృద్ధి కార్యక్రమాల పేరిట జేసీ వర్గీయుల హడావిడి చేస్తున్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వైఎస్సార్‌సీపీ కార్యక్రమం కేంద్రాన్ని మార్చుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచనతో వైఎస్సార్‌సీపీ పెద్దారెడ్డి.. యాడికి మండల కేంద్రానికి ర్యాలీ కార్యక్రమానికి మార్చారు. దీంతో, యాడికి మండల కేంద్రంలో ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాట్లు చేశారు.
అయినప్పటికీ తాజాగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలకు దిగారు. యాడికిలో వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని జేసీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామునే పెద్దారెడ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. తాడిపత్రిలోని ఇంటి వద్దే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పెద్దారెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను పెద్దారెడ్డి ప్రశ్నించారు.

ఈ సందర్బంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ.. నా కార్యక్రమాలకు సంబంధించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాను. నా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని ముందే పోలీసులు విజ్ఞప్తి చేశాను. రాత్రి నా కార్యక్రమాలకు అనుమతి ఇచ్చి ఇప్పుడు అడ్డుకోవడం ఏంటి?. చంద్రబాబు, జేసీ మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తాడిపత్రి పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేను ర్యాలీ చేస్తే అభ్యంతరం ఎందుకు?. నన్ను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని దూషించారు. అయినప్పటికీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ గ్యాంగ్ స్టర్‌లా వ్యవహరిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై పోరాటం కొనసాగిస్తా’ అని వ్యాఖ్యలు చేశారు.


