‘పుష్ప–2’ తొక్కిసలాట కేసులో ఏ11గా అల్లు అర్జున్
23 మందిపై చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు
సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఘటన అని తేలినా వదలని వైనం
బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం చేసిన అల్లు అర్జున్
అయినా కక్ష పూరితంగా వ్యవహరించడంపై సినీ వర్గాల విస్మయం
ఇలాగైతే మరి ఏపీలో చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాలి?
గోదావరి పుష్కరాలు, సభల్లో తొక్కిసలాటతో పదుల సంఖ్యలో జనం మృత్యువాత
వీటన్నింటికీ చంద్రబాబే కారణమని ప్రత్యక్షంగా తేలినా కేసుల్లేవ్.. చార్జిషిట్లు లేవ్
ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా అని మండిపడుతున్న మేధావులు, ప్రజా సంఘాల నేతలు
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ కథా నాయకుడిగా నటించిన పుష్ప–2 సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడానికి ఆ హాలు నిర్వాహకులే కారణమని హైదరాబాద్ పోలీసులు తేల్చినా, అల్లు అర్జున్‌ను కేసులో ఏ11గా కొనసాగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గత ఏడాది డిసెంబర్ 4న చోటుచేసుకున్న ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటన పట్ల అల్లు అర్జున్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేవతి మృతికి సంతాపం తెలిపారు. రేవతి భర్తకు ఆరి్థక సహాయం చేసి.. శ్రీతేజ చికిత్సకు అవసరమైన నిధులను సమకూర్చారు. ప్రజల్లో క్రేజ్ ఉన్న సినీ నటుడు సంధ్య థియేటర్‌కు వస్తున్న నేపథ్యంలో భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. వారు ముందుగానే తగిన భద్రత కలి్పంచి ఉంటే తొక్కిసలాటకు తావుండేదే కాదు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతగా చేయాల్సిందంతా చేసినప్పటికీ, ఆయనపై చార్జ్‌షీట్ దాఖలు చేయడం సబబు కాదని, ఇది కక్ష పూరితమని సినీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు రెండు రోజుల క్రితం నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారిస్తూ మేనేజ్‌మెంట్‌తోపాటు మేనేజర్‌పైనా అభియోగాలు మోపారు.
అల్లు అర్జున్, ఆయన బృందం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై బీఎన్‌ఎస్ 105, 118 (1) రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల జాబితాలో మొత్తం 23 మంది ఉండగా.. అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. ఆయనతోపాటు ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లపైనా చార్జిషిట్ దాఖలైంది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు గత ఏడాది డిసెంబర్ 13న అరెస్టు చేశారు. కింది కోర్టు రిమాండ్ విధించగా, అదే రోజు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదలకు సంబంధించిన లాంఛనాలు పూర్తి కాకపోవడంతో ఆయన ఆ రోజు రాత్రి రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైల్లో ఉండాల్సి వచి్చంది.
అక్కడొక న్యాయం.. ఇక్కడొక న్యాయం..
అల్లు అర్జున్‌ను ఏ–11గా చేర్చుతూ పోలీసులు చార్జిషిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో తొక్కిసలాట ఘటనలకు బాధ్యుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాలని మేధావులు, సామాజిక వేత్తలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశి్నస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతగా చేయాల్సిందంతా చేసినప్పటికీ, ఆయనపై చార్జ్‌షీట్ దాఖలు చేయడం ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోందని ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు.
‘ఆంధప్రదేశ్‌లో 2015 జూలై 14న రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను నాటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆ సమయంలో తన ప్రచార కండూతితో ఒకేసారి భక్తులను ఘాట్‌లోకి వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. 2022 డిసెంబర్ 28న టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు కందుకూరులో ఇరుకు సందుల్లో నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించారు. 2023 జనవరి 1న గుంటూరులో చంద్రబాబు పాల్గొన్న సంక్రాంతి కానుక పంపిణీ సభలోనూ తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించారు.
ఇలా పలు ఘటనల్లో తొక్కిసలాటతో పదుల సంఖ్యలో జనం చనిపోవడానికి చంద్రబాబే బాధ్యుడని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి బాబుపై ఎన్ని కేసులు నమోదు చేయాలి? ఎన్ని చార్జిషిట్లు నమోదు చేయాలి?’ అని మేధావులు ప్రశ్నింస్తున్నారు. తెలంగాణలోని రేవంతరెడ్డి సర్కార్ తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అల్లు అర్జున్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేసిందని స్పష్టం చేస్తున్నారు. రెండు పక్క పక్క రాష్ట్రాల్లో జరిగిన ఘటనల్లో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం అంటూ విస్తుపోతున్నారు.


