తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ ముందు గంటపాటు హైడ్రామా నడిచింది. తన కొడుకుతోపాటు మరో ముగ్గురిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టారని శనివారం రాత్రి ఓ మహిళ రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు నాగమణి తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం ఉదయం తాడేపల్లి ఎస్‌ఐ సాయి తమ ఇంటికి వచ్చి తన కుమారుడిని గంజాయి విక్రయిన్నాడనే ఆరోపణలతో స్టేషన్‌కు తీసుకెళ్తున్నామని చెప్పారన్నారు. ఆధార్ కార్డు, ఇతర ప్రూఫ్‌లు ఇస్తే పంపించేస్తామని నమ్మబలికారని తెలిపారు. అవన్నీ తీసుకున్నాక స్టేషన్‌లో కాకుండా పక్కన వేరే గదిలో పెట్టి చిత్ర హింసలకు గురిచేశారన్నారు.
తమ కుమారుడు తేజ ముంతతోపాటు గాందీనగర్‌లో నివసించే దినేష్ ప్రేమ్‌చంద్, యర్రబాలెంలో నివాసం ఉండే పవన్‌లను కూడా ఇదే తరమాలో తీసుకొచ్చారని ఆరోపించారు. దీనిపై నిలదీస్తే అసభ్య పదజాలంతో తనను దూషించారని వాపోయారు. ఇంతలో ఒక నాయకుడు అటుగా రావడంతో సీఐ అరాచకాలను నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కాళ్లు పట్టుకుని ఆమె బతిమిలాడారు. ఓ నాయకుడు ఆ మహిళను సీఐ వద్దకు తీసుకెళ్లగా అందరి సమక్షంలోనే ‘‘200 మంది పోలీసులను 10 నిమిషాల్లో దించుతాను. మర్యాదగా చెప్పింది చెయ్యి. కపట్రాల తిప్పలో నీలాంటి వాళ్లను ఎంతోమందిని చూశాను. ఎవరు ఏం చేస్తారో చూస్తాను’’ అంటూ పెద్దపెద్దగా మాట్లాడారు.
విధులకు ఆటంకం కలిగించినట్లు ఆమెపై కేసు పెట్టండని సిబ్బందిని ఆదేశించారు. మరో మహిళ కూడా సీఐ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదంతా చూసి ఎస్‌ఐలు అవాక్కయ్యారు. సోమవారం అదుపులోకి తీసుకున్న వారిపై శనివారం ప్రకాషః్ నగర్ శ్మశానవాటిక వద్ద పట్టుకున్నట్లు కేసు నమోదు చేయడం ఏంటని, ఇది తమ తలకు చుట్టుకునేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సక్రమంగా ఉన్నతాధికారులు విచారణ చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.


