శకునం చెప్పే బల్లి కుడితిలో పడిపోవడం అంటే ఇదే మరి.. రాష్ట్ర.. జాతీయ రాజకీయాల గురించి.. చిత్రవిచిత్రమైన హావ భావాలతో మిమిక్రీ చేస్తూ ఎదుటివాళ్లను అవహేళన చేయడమే తన ఘనతగా చెప్పుకుంటూ వస్తున్నా ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఒక పోలీస్ అధికారి నోటికి చిక్కారు.
గతంలో తనను ఇబ్బంది పెట్టారంటూ అప్పటి సీఐడీ చీఫ్.. డీజీపీ పీవీ సునీల్ కుమార్‌ను టార్గెట్ చేసిన రఘురామకృష్ణం రాజు సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆనాడు తన విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరించిన పీవీ సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేయాలంటూ రఘురామ పోస్టులు చేయడమే కాకుండా ప్రకటనలు కూడా చేస్తున్నారు. దీనిపై సునీల్ దీటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సునీల్ కుమార్ రఫ్ఫాడిస్తున్నారు.
రఘురామ పాత చరిత్రను తవ్వుతూ సోషల్ మీడియాలో పోస్టుల పరంపర కొనసాగించారు. ఇదే తరుణంలో రఘురామ గతంలో బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సునీల్ కుమార్ చేతిలో అస్త్రాలుగా మారాయి.. దీనిపై అయన ఏమని పోస్ట్ చేసారంటే..
‘‘కె.రఘురామకృష్ణరాజు ఓ ‘420’.. మూడు బ్యాంక్‌ల నుంచి రూ.945 కోట్లు లూటీ చేశారు.. దీనిపై ఆయనపై సీబీఐ ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), నేరపూరిత కుట్రతోపాటు 120బీ (కుట్ర) కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సుప్రీం కోర్టు ఆర్‌ఆర్‌ఆర్‌ని, ఆయన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయడానికి మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధాని గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో డిప్యుటీ స్పీకర్ హోదా లో రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అయితే ఆది ఆయనకి కాదు రాష్ట్రం మొత్తానికి తలవంపులు. అమరావతి బ్రాండ్ దెబ్బ తింటుంది. పెట్టుబడి పెట్టేవాళ్ళు వెనక్కి పోతారు. ఇలాంటి గజదొంగను, చీటర్‌ని ఇంత పెద్ద పదవిలో ఎలా ఉంచారు అనే ప్రశ్న రాదా?
..ఈ కేసు దర్యాప్తు ముగిసి, కోర్టులో విచారణ పూర్తి అయ్యి రఘురామకృష్ణ రాజు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి సహా ఏ పదవి అయినా ఇవ్వండి. అభ్యంతరం లేదు. ఉప సభాపతి హోదాలో రఘురామకృష్ణ రాజు గారు అరెస్ట్ అయితే అది రాష్ట్రానికే అవమానం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఆయన అరెస్ట్ అయితే ఆయన వరకే అది పరిమితం అవుతుంది. మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తుననా.. మీరు ప్రజల పక్షాన ఉండాలి. ఒక వ్యక్తి వైపు కాదు.. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట పౌరుడిగా నా బాధ్యత. 420 రఘురామ కృష్ణ రాజు గారి మీద ఇంకా అనేక అభియోగాలు ఉన్నాయి. ఆ రిపోర్టులు కూడా నా దగ్గర ఉన్నాయి. వాటిల్లో కూడా కొత్త కేసులు నమోదు అవుతాయి. అందుకోసం నేను సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్‌లు వేస్తాను. ఈ కేసులో 420 రఘురామకృష్ణ రాజు బయటపడటం జరగదు
..అన్ని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. పైగా దర్యాప్తు చేస్తున్నది సీబీఐ. ఒక 420 కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ఇమేజ్‌ను ఫణంగా పెట్టవద్దు. నేను చెప్పిన విషయాలు అసత్యం అయితే నా మీద చర్య తీసుకోండి. నేను సిద్ధం. నిజం కాబట్టి తక్షణం 420 రఘురామకృష్ణ రాజు గారిని అన్ని పదవుల నుండి తొలగించాలి. అమరావతి బ్రాండ్ ఇమేజ్ కోసం అమరావతి రైతులు 420 రఘురామకృష్ణ రాజు ని అన్ని పదవుల నుండి తొలగించేలా ఉద్యమం చేయాలి. జై అమరావతి.. జై స్వర్ణాంధ్రప్రదేశ్… జై భీమ్' అంటూ సునీల్ ఎదురుదాడి కొనసాగించారు.
తనను సస్పెండ్ చేయడం న్యాయమైతే కోట్లకు బ్యాంకులను ముంచిన రాజును కూడా సస్పెండ్ చేయాలనీ.. ఇదే చేస్తే ఒక శాసన సభ డీప్యూటీ స్పీకర్ సస్పెన్షన్ అనేది రాష్ట్ర పరువుకు సంబంధించిన అంశం అని.. ఆయనను సస్పెండ్ చేస్తే దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువు పోతుందని అవహేళన చేసారు. ఇదిలా ఉండగా సునీల్‌కు అంబేద్కర్ యువజన సంఘాలు.. దళిత సంఘాలు సైతం మద్దతు పలుకుతుండగా అటు రఘురామ మాత్రం కూటమి ప్రభుత్వంలో ఒంటరి అయ్యారు. ఆయనకు మద్దతుగా తెలుగుదేశం వాళ్ళు కానీ.. జనసేనావాళ్లు కానీ.. కనీసం బీజేపీ వాళ్ల కానీ ఒక్క ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో కూడా ఒక పోస్టు పెట్టలేదు. దీంతో సునీల్ కుమార్ నేరుగా రఘురామను టార్గెట్ చేసి ఆయన్ను, అయన కుటుంబాన్ని బ్యాంకుల దొంగగా సంభోదిస్తూ పరువు తీస్తున్నారు. దీనికి ఎదురు సమాధానం ఇవ్వలేక రఘురామ సైలెంట్ అయ్యారు.
-సిమ్మాదిరప్పన్న


