సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ నేతల తీరును మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. టీడీపీ నేతలు సూచనల మేరకే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో, పెద్దారెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది.
తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 296, 79, 351(2), 351(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు స్పందిస్తూ.. తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దూషించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనకడుగు వేశారని ఘాటు విమర్శలు చేశారు. దీంతో, తాడిపత్రి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


