తాడేపల్లి : ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేపడుతున్న చర్యలకు ప్రజామోదం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత మేరుగ నాగార్జున విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్రంలో ఉద్యమం జరిగిందని, ప్రైవేటీకరణ వలన పేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 29వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్రంలో ఉద్యమం జరిగింది. అయినా చంద్రబాబు తన ఆలోచనా విధానాన్ని మార్చుకోలేదు. ప్రైవేటీకరణ వలన పేదలు తీవ్రంగా నష్టపోతారు. మెడికల్ కాలేజీల కోసం ఏ కాంట్రాక్టర్ కూడా రాలేదు.
కాలేజీలను స్వాధీనం చేసుకుంటే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని అర్ధం చేసుకున్నారు. కానీ ఆదోని కాలేజ్ కోసం కిమ్స్ ఆస్పతరికి చెందిన ఒక డాక్టర్‌తో టెండర్ వేయించారు. ఒకే ఒక్క టెండర్ పెడితే దాన్ని కూడా ఆమోదించడం చూస్తే ప్రభుత్వం ఎటు పోతుంది?, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తి చేతిలో ఎలా పెడతారు?, కోటి సంతకాలతో ప్రజల ఆకాంక్షలు తెలిసినా ప్రభుత్వం బరితెగించింది. రాష్ట్రంలో విద్య వ్యాపారం చేశారు. జగన్ తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారు. ఇక వైద్య విద్యలాంటిది పేదలకు అసలు అందే అవకాశం లేకుండా చేశారు. చంద్రబాబు చర్యలకు ప్రజామోదం లేదు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించరు’ అని స్పష్టం చేశారు.


