విజయవాడ: మెడికల్ కాలేజీల పీపీపీలో ప్రభుత్వ బండారం మరోసారి బట్టబయలైంది. సింగిల్ బిడ్‌కే మెడికల్ కాలేజీ అప్పగించాలనే నిర్ణయంతో ప్రభుత్వం బండారం బయటపడింది. ఆదోని మెడికల్ కాలేజి రాజేంద్ర కుమార్ ప్రేమ్ చంద్ షా కి అప్పగించాలని తీసుకున్న నిర్ణయంతో అసలు ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళుతుందనేది వెల్లడైంది. సింగిల్ బిడ్ అయినా అగ్రిమెంట్ చేసుకుంటామని మంత్రి సత్య కుమార్ ప్రకటించారు. అయితే సింగిల్ బిడ్‌కి ఇవ్వడం నిబంధనలకు విరుద్దవం కాదా అని మీడియా ప్రశ్నించగా, అన్ని పట్టించుకుంటే ఎలా ? అని తిరిగి ప్రశ్నించారు. సింగిల్ బిడ్‌కే అప్పగిస్తామని మంత్రి ప్రకటించారు.
దీనిపై వైఎస్సారసీపీ మండిపడుతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేదలు తీవ్రంగా నష్టపోతారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. ‘ఆదోని కాలేజ్ కోసం కిమ్స్ ఆస్పత్రికి చెందిన ఒక డాక్టర్‌తో టెండర్ వేయించారని,. ఒకే ఒక్క టెండర్ పెడితే దాన్ని కూడా ఆమోదించడం చూస్తే ప్రభుత్వం ఎటు పోతుంది?, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తి చేతిలో ఎలా పెడతారు?, కోటి సంతకాలతో ప్రజల ఆకాంక్షలు తెలిసినా ప్రభుత్వం బరితెగించింది. రాష్ట్రంలో విద్య వ్యాపారం చేశారు. జగన్ తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారు. ఇక వైద్య విద్యలాంటిది పేదలకు అసలు అందే అవకాశం లేకుండా చేశారు. చంద్రబాబు చర్యలకు ప్రజామోదం లేదు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించరు’ అని హెచ్చరించారు.


