సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో మంత్రి నారా లోకేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. అంబేద్కర్ విగ్రహానికి నారా లోకేష్ నివాళులర్పించకుండా వెళ్లిపోయారు. దీంతో లోకేష్ తీరుపై దళిత సంఘాలు, టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది.
'తల్లికి వందనం' ఎగనామం
ఎన్నికల సమయంలో బూటకపు హామీలు గుప్పించి...అధికారంలోకి రాగానే హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించడం చంద్రబాబు నైజం. ఈ క్రమంలోనే తల్లికి వందనం పథకాన్ని కొందరికే అమలు చేసి మరోసారి తల్లులను మోసం చేశారు. అర్హత ఉన్న వారందరికీ తల్లికి వందనం డబ్బు జమ చేస్తామంటూనే నేటికి ఏడాదిన్నర దాటినా నిబంధనల పేరుతో నేటికీ నియోజకవర్గంలో వేలాది మంది తల్లులకు డబ్బు జమ చేయకుండా చేతులు దులుపుకున్నారు.
జీఓ ప్రకారం తల్లికి వందనం పథకం లబ్ధిదారుల్లో భారీగా కోత పడింది. నియోజకవర్గ వ్యాప్తంగా 309 మొత్తం పాఠశాలలుండగా 38,221 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 38,221 మందికి తల్లికి వందనం పథకం వర్తింపజేయాల్సి వుంది. కానీ భూమి లేకున్నా భూమి ఉందని, వాహనం ఉందని, ప్రైవేట్ జాబ్ ఉందని ఇలా పలు రకాలుగా తల్లులకు ఎగనామం పెట్టేశారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. కులం, మతం, వర్గం పార్టీ చూడకుండా జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా సకాలంలో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసేవారు. దీనికి తోడు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు, జగనన్న విద్యా కానుక, విదేశీ విద్యా దీవెన తదితర అనేక పథకాలు క్యాలెండర్ ప్రకారం అమలు చేసేవారు.
పాఠశాలలు తెరిచే సమయానికే ఒక్క అమ్మ ఒడి పథకం ద్వారానే నియోజకవర్గ వ్యాప్తంగా ఏటా 27,923 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.77.72 కోట్లు జమ చేసేవారు. అంతే కాకుండా విద్యా దీవెన పథకంలో 24,082 మంది ఇంటర్ విద్యార్థులకు ఏటా రూ.41.67 కోట్లు అందజేశారు. జగనన్న వసతి దీవెన కింద 22,543 మంది విద్యార్థులకు రూ.21.24 కోట్లు బ్యాంకు ఖతాల్లో జమ చేశారు. ఇలాంటి పథకాలను పక్కాగా అమలు చేయడంతో తల్లిదండ్రులపై పిల్లల చదువుల భారం పెద్దగా పడేది కాదు.


