సాక్షి, అనంతపురం: నోరెత్తితో నోటీస్ పంపడం, ప్రశ్నిస్తే జైల్లో పెట్టడం, నచ్చకపోతే పోలీసులతో కొట్టించడం.. పోలీసులను అడ్డం పెట్టుకుని కూటమి నాయకులు రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే పూర్తిగా విఫలమైందన్నారు.
ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగడం కష్టమనే నిర్ణయానికి ప్రజలు వచ్చేశారని.. కానీ 15 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటామని చెప్పుకునే చంద్రబాబు, పవన్.. పదే పదే ప్రజలను మోసం చేయడం సాధ్యం కాదనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో సంపద ఆవిరైపోయిందని, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని కాగ్ చెప్పిన మాటలనే ఏడాదిగా వైయస్సార్సీపీ చెబుతూ వస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నెలనెలా రూ. 10 వేల కోట్లు అప్పులు చేస్తున్నారని, ఆ డబ్బంతా ఏమైందో చెప్పాలని సాకె శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కష్టమే:
గొప్పగా ఉన్నామని, అద్భుతంగా పాలన చేస్తున్నామని చంద్రబాబు ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నా కూటమి ప్రభుత్వ లోపాలు, పాలనా వైఫల్యాలు నిత్యం బయటపడుతూనే ఉన్నాయి. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌ని రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదు. ఏడాదిన్నర పాలన చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కష్టమనే నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు.
అందుకే మరో పదిహేనేళ్లు మేమే అధికారంలో ఉంటామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు ప్రచారం చేసుకుని ఆత్మ సంతృప్తి పొందుతున్నారు. ప్రభుత్వంపై నున్న వ్యతిరేకత కప్పిపుచ్చుకునేందుకు కూటమి నాయకులు చేయని ప్రయత్నం, తొక్కని అడ్డదారులు లేవు. పోలీస్ వ్యవస్థను విచ్చలవిడిగా వాడుకుని ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేవారిని, అన్యాయాలను ప్రశ్నించే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
కాదేదీ కేసుకు అనర్హం అన్నట్టుంది:
కాదేదీ కేసులకు అనర్హం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాదానికి వేళాపాలా లేకుండా నడుస్తున్న బెల్ట్ షాపులు, వాటిలో ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్న నకిలీ మద్యమే కారణమై ఉండొచ్చన్న అనుమానం ప్రజల్లో ఉంది. దానిపై ప్రభుత్వం విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేస్తే 27 మందిపై అక్రమ కేసులు పెట్టారు. ఇదే కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీడియా వ్యవహారాలు చూసే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి కూడా నోటీసులిచ్చారు. నోరెత్తితే నోటీస్ పంపిస్తాం అన్నట్టుగా కూటమి పాలన సాగుతోంది.
తండ్రి అంత్యక్రియలకు వచ్చిన ఎన్నారై భాస్కర్ రెడ్డిని పోలీసులే అత్యంత పాశవికంగా కొట్టడమే కాకుండా అతడిపైనా కేసులు పెట్టారు. నకిలీ మద్యం గురించి ప్రశ్నిస్తుంటే కొంతమంది పోలీసులు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదు? నకిలీ మద్యం వ్యవహారంలో కీలక సూత్రధారులంతా టీడీపీ నాయకులేనని తేలిన తర్వాత కూడా ఇప్పటివరకు ఏ ఒక్కర్నీ అరెస్ట్ చేసిన పాపానపోలేదు. అద్దేపల్లి జనార్దన్ రావును మేనేజ్ చేసి ఆఫ్రికా నుంచి పిలిపించి జైలుకు పంపారు. ఆయన నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకుని మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అరెస్ట్ చేశారు.
ప్రభుత్వానికి ఏ కష్టం వచ్చినా, టీడీపీ నాయకులు ఏ కేసులో ఇరుక్కున్నా దాన్ని డైవర్ట్ చేయడానికి వైయస్సార్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ సీబీఐ విచారణకి డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? నకిలీ మద్యం తయారీలో తన పాత్ర లేదని కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేసినా, సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించినా మరుసటి రోజునే జోగి రమేశ్‌ను అరెస్ట్ చేశారంటే నిజాలు బయటకు రావడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదని అర్థమైపోయింది. సీబీఐ విచారణలో నిజాలు బయటకొస్తే తెలుగుదేశం నాయకులు జైలుకెళ్లాల్సి ఉంటుందని, తీగలాగితే పెద్ద తలకాయల గుట్టు బయటకొస్తుందని భయపడిపోతున్నారు. అందుకే చంద్రబాబు తన ఆదేశాల ప్రకారం నడిచే సిట్ పేరుతో కేసును నీరుగార్చేస్తున్నాడు.
గాడితప్పిన శాంతిభద్రతలు:
మొంథా తుపాన్‌తో పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు లండన్ వెళ్లిపోయాడు. మంత్రి నారా లోకేశ్ క్రికెట్ చూడటానికి ముంబై వెళ్లిపోయాడు. దీనిపైనా ప్రశ్నించకూడదు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతుంటే కోర్టులు పోలీసులకు మొట్టికాయలు వేస్తుండటంతో చివరికి పోలీసులు దిగజారిపోయి గంజాయి కేసులు పెడుతున్నారు.
బాధితులకు అండగా నిలబడాల్సిన పోలీసులే బాధితులను వేధింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ లేదు. దోపిడీలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. కానీ నేరస్తులకు శిక్షలు పడటం లేదు. ఏడుగుర్రాలపల్లెలో 14 ఏళ్ల బాలికపై ఏడాదిపాటు 16 మంది అత్యాచారం చేస్తే చర్యలుండవు. బాధితుల తరఫున ప్రశ్నిస్తే వైయస్సార్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు మాత్రం పెడుతున్నారు.
అప్పులు తెచ్చుకోవడమే సంపద సృష్టి అన్నట్టుంది:
రాష్ట్రంలో చంద్రబాబు నియంత పాలన సాగిస్తున్నాడు. అడుగడుగునా మోసం, అబద్ధాలు,అప్పులు తప్ప ఏడాదిన్నర పాలన చూస్తే అభివృద్ది ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనో రూ.2.27 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆరు నెలల్లో రూ.4570 కోట్లు బడ్జెట్ వ్యయం తక్కువ చేశారు. ప్రభుత్వ ఆదాయం 8.4 శాతం తగ్గిపోయింది. గతేడాదితో పోల్చితే రూ. 7900 కోట్ల ఆదాయం తగ్గింది. అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం 5.5 శాతం తగ్గిపోయింది. జీఎస్టీ ఆదాయం పడిపోయింది.
అప్పులు తెచ్చుకోవడమే సంపద సృష్టి అన్నట్టుగా ఉంది. రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ప్రజల వద్ద ఉన్న సంపద ఆవిరైపోయింది. చంద్రబాబు ఎప్పుడొచ్చినా ప్రజల ఆస్తులు తగ్గిపోతాయి. రాష్ట్రం అప్పులు పెరిగిపోతాయి. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. అప్పులు తెచ్చుకోవడం ఆపడం లేదు. అయినా నెలనెలా తెస్తున్న రూ.10 వేల కోట్ల అప్పులు ఏమైపోతున్నాయో తెలియడం లేదు. ఏపీ అప్పులపై వాస్తవాలు చెప్పిన కాగ్ పైన కూడా చంద్రబాబు కేసు పెడతారా?
వైఎస్ జగన్ తీసుకొచ్చిన అదానీ డేటా సెంటర్‌కి పేరు మార్చి గూగుల్ సెంటర్ పేరుతో తండ్రీ కొడుకులు మార్కెటింగ్ చేసుకున్నారు. 25 వేల ఉద్యోగాలిచ్చేలా అదానీతో నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఒప్పందం చేసుకుంటే, గూగుల్ డేటా సెంటర్‌తో వచ్చే ప్రత్యక్ష ఉద్యోగాల గురించి మాత్రం వాస్తవాలు చెప్పలేకపోతున్నాడు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేసే దుర్మార్గ ఆలోచన చేశాడు చంద్రబాబు. పదే పదే ప్రజలను మోసం చేయడం సాధ్యంకాదని ఇప్పటికైనా గుర్తుంచుకుంటే మంచిది. రాజ్యాంగబద్దంగా పాలన సాగించాలి. లేదంటే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తున్నా..


