ఈ కార్తీకంలో ఉసిరితో పసందైన వంటకాలు చేసేద్దాం ఇలా..! | Recipes: Delicious Amla Recipes To Boost Your Immunity | Sakshi
Sakshi News home page

ఈ కార్తీకంలో ఉసిరితో పసందైన వంటకాలు చేసేద్దాం ఇలా..!

Nov 9 2025 3:27 PM | Updated on Nov 9 2025 4:12 PM

 Recipes: Delicious Amla Recipes To Boost Your Immunity

ఉసిరి క్యాండీ
కావలసినవి: ఉసిరికాయలు (పెద్దవి)– అర కప్పు, పంచదార – అరకప్పు (ఉసిరికాయల బరువుకు సమానంగా తీసుకోవచ్చు)
ఏలకుల పొడి, పంచదార పొడి– కొద్దికొద్దిగా (గార్నిష్‌ కోసం, అభిరుచిని బట్టి)

తయారీ: ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, నీటిలో వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. ఉడికిన ఉసిరికాయలను చల్లార్చి, చాకుతో గింజలను తీసి ముక్కలను జాగ్రత్తగా విడదీయాలి. ఈలోపు ఒక వెడల్పాటిపాత్ర తీసుకుని, అందులో సగం ఉసిరి ముక్కలు, దానిపై సగం పంచదార వేయాలి. ఇదే విధంగా మిగిలిన ఉసిరి ముక్కలు, మిగిలిన పంచదార వేయాలి. 

పాత్రపై మూత పెట్టి, 3 నుంచి 4 రోజుల పాటు ఉంచాలి. ఈ సమయంలో పంచదార మొత్తం కరిగి, పాకంగా మారి ఉసిరి ముక్కలలోకి చేరుతుంది. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ముక్కలు విరగకుండా పాత్రను మెల్లగా కదపాలి. 4 రోజుల తర్వాత ఉసిరి ముక్కలు మెత్తగా మారి, పంచదార మొత్తం ద్రవ రూపంలోకి మారుతుంది. 

ఇప్పుడు ఆ ఉసిరి ముక్కలను పాకం నుంచి వేరు చేసి, ఒక ప్లేట్‌లో లేదా జల్లెడలో పరచాలి. (ఆ పంచదార పాకాన్ని వేరే దేనికైనా ఉపయోగించుకోవచ్చు). పాకం తీసిన ఉసిరి ముక్కలను, ఎండ తగిలే ప్రదేశంలో సుమారు 3 రోజుల పాటు పూర్తిగా ఆరిపోయే వరకు ఎండబెట్టాలి. క్యాండీ ఒకదానికి ఒకటి అంటుకోకుండా, మృదువుగా అయ్యేంతవరకు ఎండబెట్టడం ముఖ్యం. పూర్తిగా ఆరిన ఆ ఉసిరి క్యాండీ ముక్కలను సర్వ్‌ చేసుకునే ముందు ఏలకుల పొడి, పంచదార పొడితో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే బాగుంటాయి. ఈ ఉసిరి క్యాండీని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే, ఏడాది వరకు పాడవకుండా ఉంటుంది.


ఉసిరి పులిహోర
కావలసినవి: అన్నం– ఒక కప్పు (వండి చల్లార్చినది)
ఉసిరికాయలు (పెద్దవి)– 5 (మరింత పులుపు కావాలనుకుంటే పెంచుకోవచ్చు)
నూనె– 3 టేబుల్‌స్పూన్లు, ఆవాలు– ఒక టీస్పూన్‌
శనగపప్పు, మినప్పప్పు– ఒక టేబుల్‌స్పూన్‌ చొప్పున
పల్లీలు– 2 టేబుల్‌స్పూన్లు
ఎండు మిరపకాయలు– 2 (తుంచి పెట్టుకోవాలి)
పచ్చి మిరపకాయలు– 3 (మధ్యలోకి కట్‌ చేసుకోవాలి)
అల్లం – చిన్నది (తరగాలి), కరివేపాకు– ఒక రెమ్మ
పసుపు – అర టీస్పూన్, ఇంగువ– చిటికెడు (అభిరుచిని బట్టి), ఉప్పు– సరిపడా, కొత్తిమీర– కొద్దిగా

తయారీ: ముందుగా అన్నాన్ని వెడల్పాటి పాత్రలో వేసి పూర్తిగా చల్లార్చాలి. ఈలోపు ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, గింజ తీసి, తురుముకోవాలి. వాటిని మిక్సీ పట్టుకోవాలి. లేదంటే ఉసిరికాయలను కొద్దిగా ఉడికించి, చల్లారాక తురుముకోవచ్చు. ఇప్పుడు ఒక మందపాటి కడాయిలో నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక, ఆవాలు వేసి చిటపటలాడగానే, శనగపప్పు, మినçప్పప్పు, పల్లీలు వేసి దోరగా వేయించాలి. తరువాత ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు, అల్లం తురుము, కరివేపాకు, చిటికెడు ఇంగువ, పసుపు, రుచికి సరిపడా ఉప్పు

వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉసిరికాయ తురుమును తాలింపులో వేసి, పచ్చి వాసన పోయే వరకు సుమారు 2 లేదా 3 నిమిషాలు వేయించాలి. 

ఉసిరి తురుము వేగిన తర్వాత స్టవ్‌ ఆపెయ్యాలి. ఆ ఉసిరి తాలింపును చల్లారిన అన్నంలో వేసి, అన్నం మెతుకు విరగకుండా, తాలింపు అంతా అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి, అవసరమైతే కొద్దిగా వేసి మళ్ళీ కలుపుకోవచ్చు. కాసేపు పక్కనే ఉంచితే ఉసిరికాయ పులుపు అన్నానికి బాగా పట్టి, మంచి రుచి వస్తుంది. తర్వాత కొత్తిమీర తురుముతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

ఉసిరి హల్వా
కావలసినవి:  ఉసిరికాయలు (పెద్దవి)›– 500 గ్రా., చక్కెర లేదా బెల్లం తురుము – 500 గ్రా., (ఉసిరికాయలు ఎంత తీసుకుంటే అంత మోతాదులో తీసుకోవచ్చు), నెయ్యి – 5 టేబుల్‌స్పూన్లు, ఏలకుల పొడి – ఒక టీస్పూన్, ఫుడ్‌ కలర్‌ – అభిరుచిని బట్టి, డ్రై ఫ్రూట్స్‌ (జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు) – కొద్దికొద్దిగా (నేతిలో వేయించుకోవాలి)

తయారీ: ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, 15 నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి. ఉడికిన ఉసిరికాయలను చల్లార్చి, గింజలు తీసేసి, ముక్కలను మిక్సీలో నీళ్లు వేయకుండా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. 

ఈలోపు ఒక మందపాటి కడాయిలో రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని, అందులో జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు వంటి డ్రై ఫ్రూట్స్‌ను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఉసిరి పేస్ట్‌ను వేసి, నెయ్యిలో పచ్చి వాసన పోయే వరకు సుమారు 7 నిమిషాలు బాగా వేయించాలి. ఉసిరి పేస్ట్‌ కాస్త రంగు మారిన తర్వాత, బెల్లం తురుము లేదా చక్కెరను వేసుకోవాలి. అది కరిగి, ఉసిరి పేస్ట్‌తో బాగా కలిసిపోయి, ఆ మిశ్రమం దగ్గరపడే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. మధ్యలో ఫుడ్‌ కలర్‌ వేసుకోవచ్చు. 

ఈ మిశ్రమం గట్టిపడుతున్నప్పుడు, మిగిలిన నెయ్యిని కొద్దికొద్దిగా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. హల్వా కడాయి అంచులను వదిలి, ముద్దగా తయారయ్యే వరకు ఉడికించాలి. చివరిగా ఏలకుల పొడి వేసి బాగా కలిపి, స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ ముక్కలతో అలంకరించి సర్వ్‌ చేసుకోవచ్చు. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement