కొలెస్ట్రాల్ అనగానే అది చెడ్డదనే భావన చాలామందిలో ఉంటుంది. అయితే ఇటీవల వైద్యవిజ్ఞానంపట్ల పెరిగిన అవగాహనతో కొలెస్ట్రాల్‌లో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉంటాయన్న విషయాలు చాలామందికి తెలుసు. ఇందులో మంచి కొలెస్ట్రాల్ గుండెజబ్బులను నివారించడమే కాకుండా, యౌవనంలో మంచి కొలెస్ట్రాల్ తీసుకునేవారిలో వృద్ధాప్యంలో కొందరిలో వచ్చే అల్జైమర్స్‌నూ నివారిస్తుందంటున్నారు ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌కు చెందిన పరిశోధకులు.
హై డెన్సిటీ లైపో ప్రోటీన్ (హెచ్‌డీఎల్) అని పిలిచే మంచి కొలెస్ట్రాల్ గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే ప్లాక్ అనే ఒకరకం అడ్డంకిని తొలగించడంతోపాటు మెదడులో అభివృద్ధి చెందే ప్లాక్ (గార)ను పూర్తిగా తొలగించకపోయినప్పటికీ చాలావరకు నిరోధిస్తుందంటున్నారు కొలెస్ట్రాల్‌పై పరిశోధనలు సాగిస్తున్న పరిశోధకులు. అలా అది గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్ ముప్పులను తప్పిస్తుంది.
ఇంకా ఆ పరిశోధకులు చెబుతున్న అంశాలను బట్టి... మన శరీరానికి అందాల్సిన మంచి కొలెస్ట్రాల్ తగినంతగా అందనివారిలో 60 ఏళ్లు దాటాక చాలామందికి మతిమరపు వచ్చే అవకాశాలు ఎక్కువ. మంచి కొలెస్ట్రాల్ తగ్గిన వారి మెదడుల్లో జ్ఞాపకశక్తిని బ్లాక్ చేసేలా ఒకరకం గార (΄్లాక్) అభివృద్ధి చెందుతుంది. అది మెదడులోని నాడీ కణాల మధ్య సాగే ఎలక్ట్రిక్ తరంగాల మధ్య ఒక అడ్డంకిగా మారి జ్ఞాపకశక్తిని తగ్గి స్తుంది.
దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... యుక్తవయసులో తగినంత మంచి కొలెస్ట్రాల్ తీసుకోనివాళ్లలో వారి వృద్ధాప్యంలో అల్జైమర్స్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారా పరిశోధకులు. ఈ విధంగా మనకు మంచి కొలెస్ట్రాల్ మేలు చేస్తుందని మరోమారు తేటతెల్లమైంది.
అందుకే ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఆహారంలో మంచి కొలెస్ట్రాల్ మోతాదులు తగ్గకుండా చూసుకోవడం మేలు చేస్తుంది. ఇందులోని అంశాలన్నీ ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇటీవల కొలెస్ట్రాల్ అంటే చెడుదనే భావన పెంచుకున్న కొందరు కొలెస్ట్రాల్‌పై అపోహలు పెంచుకుని చెడు కొలెస్ట్రాల్‌తోపాటు మంచి కొలెస్ట్రాల్‌ను కూడా తీసుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిశోధనల నేపథ్యంలో మంచి కొలెస్ట్రాల్ మోతాదులు ఎక్కువగా ఉండే చేపలు, కోడిగుడ్లలోని తెల్లసొన (ఎగ్ వైట్), నట్స్, కాయధాన్యాల వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న పరిశోధకులు, న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.
(చదవండి: ఆందోళన నుంచి వచ్చింది ఒక ఐడియా!)


