నేడు మళ్లీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు..
ఎక్కే విమానం.. దిగే విమానం.. డిప్యూటీ సీఎం పవన్ బిజీ
సాక్షి టాస్క్ ఫోర్స్: డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తిరుపతి జిల్లా పర్యటన వన్‌మ్యాన్ షోలా సాగింది. ఎక్కే విమానం.. దిగే విమానం.. అన్నట్లు తన రెండు రోజుల పర్యటనను బిజీబిజీగా ప్లాన్ చేసుకున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పవన్.. రోడ్డు మార్గాన మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లారు. వాచ్ టవర్ ఎక్కి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు.
అనంతరం తిరుపతి మంగళంలోని గోదాముల్లో నిల్వ ఉన్న ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. ఆ తర్వాత తిరుపతి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశం ఉంటుందని, ఎవరూ ఎలాంటి ప్రశ్నలు అడగరాదని సమాచార శాఖ అధికారులు హుకుం జారీ చేశారు. ‘దొంగల నుంచి పట్టుబడ్డ 2.65 లక్షల టన్నుల ఎర్రచందనం దుంగలు తిరుపతిలోని గోదాములో ఉన్నాయి.
వాటి విలువ రూ.2వేల నుంచి రూ.5 వేల కోట్లు ఉంటుంది. పట్టుబడకుండా స్మగ్లింగ్‌లో తరలిపోయింది చాలా ఉంటుంది. కర్ణాటక రూ.140 కోట్లు సొమ్ము చేసుకుంది. ఎక్కడ ఎర్రచందనం దొరికినా అది ఏపీకే చెందేలా ఒప్పందం జరిగింది. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు కీలక వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటాం. ఎర్రచందనం జోలికెళితే తాట తీస్తా’ అని పవన్ చెప్పుకొచ్చారు.
ఎవరినీ కలవని పవన్..
కాగా, పవన్ వచ్చారని తెలిసి దివ్యాంగులు, రైతులు, జనసేన శ్రేణులు.. పలు సమస్యలపై అర్జీలు తీసుకుని రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. అయితే పవన్ ఏ ఒక్కరినీ కలువలేదు. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జ్ కోట వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు కుటుంబ సభ్యులు.. ప్లకార్డులు పట్టుకుని కేకలు వేసి పిలుస్తున్నా పట్టించుకోకుండా ముందుకు సాగారు.
రేణిగుంట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ఎక్కి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. కాగా, పవన్ ఆదివారం తిరిగి ప్రత్యేక విమానంలో రేణిగుంట రానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పలమనేరు వెళతారు. అక్కడ కుంకీ ఏనుగులను పరిశీలించి, తిరిగి హెలికాప్టర్‌లో రేణిగుంటకు వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లేక గన్నవరం వెళ్లనున్నారని అధికారులు తెలిపారు.


