సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అస్వస్థతకు గురయ్యారు. వైఎస్ జగన్ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల సూచన మేరకు ఈరోజు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ వేదికగా ఈ ప్రకటనను విడుదల చేసింది.
పులివెందుల
జ్వరంతో బాధపడుతున్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
డాక్టర్ల సూచన మేరకు పులివెందుల పర్యటనలో ఇవ్వాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్న వైయస్ జగన్— YSR Congress Party (@YSRCParty) December 24, 2025
కాగా, పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ నేడు ఇడుపులపాయలో ప్రార్థనల్లో పాల్గొనాల్సి ఉంది. అలాగే, మధ్యాహ్నం పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాలు రద్దు అయ్యాయి. ఇక, రేపు పులివెందుల సీఎస్ఐ చర్చి క్రిస్టమస్ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొనే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్ మంగళవారం పులివెందులో నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అందరినీ పేరుపేరున పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తమ కష్టాలను జగన్‌తో వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలన్ని ఓపికతో విని.. నేనున్నానని, రాబోయే రోజులు మనవేనంటూ ధైర్యం చెప్పారు. సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కష్టాలు వింటూ సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. వైఎస్ జగన్ పులివెందులకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పార్టీ అభిమానులు, క్యాడర్‌తో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో క్యాంపు కార్యాలయ ప్రాంగణం నిండిపోయింది. జగన్ అక్కడకు రాగానే జై జగన్ నినాదాలతో కార్యాలయం ప్రాంగణం హోరెత్తింది.
ఈ సందర్భంగా టీచర్లను ప్రభుత్వం వేధిస్తున్న తీరును వైఎస్సార్‌టీఏ నేతలు వివరించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గుది బండగా మారిందని జగన్ దృష్టికి తెచ్చారు. తద్వారా రాష్ట్రంలోని 1.30 లక్షల మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. టీచర్ల సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. మన ప్రభుత్వంలో టీచర్లకు అన్ని విధాలుగా మేలు చేశామని, ఈ ప్రభుత్వం నాలుగు డీఏలు పెండింగ్ పెట్టిందని, ఇప్పటి వరకు పీఆర్‌సీ చైర్మన్‌ను నియమించలేదని, పీఆర్‌సీ కూడా ప్రకటించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులందరికీ మేలు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు.


