‘పింఛన్ల కోత.. చంద్రబాబు సర్కార్ తీరు అమానవీయం’ | Andhra Pradesh Pensions Cut: YSRCP Leader Slams Chandrababu Govt Over Welfare Reductions | Sakshi
Sakshi News home page

‘పింఛన్ల కోత.. చంద్రబాబు సర్కార్ తీరు అమానవీయం’

Aug 22 2025 2:53 PM | Updated on Aug 22 2025 3:13 PM

Ysrcp Leader Anantha Venkatarami Reddy Fires On Pensions Cut

సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లలో భారీ కోత పెట్టేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు నెలల కాలంలోనే 4.15 లక్షల వృద్ధాప్య పెన్షన్లు తొలగించారని, వచ్చెనెల నుంచి 2 లక్షల దివ్యాంగ పెన్షన్లను రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దివ్యాంగుల పెన్షన్లపై కూటమి ప్రభుత్వం కత్తికట్టిందని, సీఎం చంద్రబాబు కనీస మానవత్వం కూడా లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దివ్యాంగులకు న్యాయం జరిగేలా వారి పక్షాన వైయస్ఆర్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. 2004లో డాక్టర్ వైయస్ రాజశేఖర్‌ రెడ్డి సీఎం అయిన తరువాత పేదరికంలో ఉండి వయస్సు మీరిపోయి, పనులు చేసుకోలేని వృద్ధులకు ఒక కొడుకులా అండగా నిలబడేందుకు ప్రతినెలా సామాజిక పెన్షన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి కూడా పెన్షన్లను అందించారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ సామాజిక పెన్షన్లను కొనసాగించాయి.

వైఎస్‌ జగన్ హయాంలో 66.34 లక్షల పెన్షన్లు:
వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షల మందికి మాత్రమే ఇస్తున్న సామాజిక పెన్షన్లతో పాటు 21 రకాల కేటగిరిలకు చెందిన దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చేందుకు చొరవ తీసుకున్నారు. ఆయన సీఎంగా దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో 66.34 లక్షల మందికి పెన్షన్లు అందాయి. ప్రతి ఏటా జనవరి, జూన్ నెలల్లో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు పెన్షన్లను పెంచుతామని, దివ్యాంగులకు కేటగిరిల వారీగా రూ.6 వేలు, రూ.10 వేలు, రూ.15 వేలు చొప్పున ఇస్తామని, కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఏడాది కాలంలోనే పెన్షన్ల సంఖ్యను 62.19 లక్షలకు కుదించుకుంటూ వచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పద్నాలుగు నెలల్లో దాదాపు 4.15 లక్షల పెన్షన్లను తొలగించారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లలో కూడా భారీగా కోత పెడుతూ వస్తున్నారు. పదేళ్ళ నుంచి పెన్షన్లు పొందుతున్న వారిని కూడా వివిధ కారణాలను చూపుతూ వారిని తొలగించారు. దివ్యాంగుల పైన కూడా ఇదే విధంగా కక్షసాధింపులు ప్రారంభమయ్యాయి.

రీ వెరిఫికేషన్ పేరుతో, సదరం క్యాంప్‌ల నుంచి ధ్రువపత్రాలు తెచ్చుకుంటేనే పెన్షన్లు ఇస్తామంటూ ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు. వైయస్ జగన్ హయాంలో దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులు పెన్షన్ పొందుతూ ఉంటే, వారిలో సుమారు 2 లక్షల మందిని తొలగించేందుకు సిద్దయయ్యారు. వచ్చేనెల నుంచి వీరికి పెన్షన్లను నిలిపివేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికేట్లలో కూడా వారి వైకల్యం శాతంను తగ్గించి ఇస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి ఉన్న వత్తిడి మేరకే ఇలా చేస్తున్నామని వారు చెబుతున్నారు. పెన్షన్ల పంపిణీ పేరుతో ప్రతినెలా సీఎం చంద్రబాబు చేస్తున్న డ్రామాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? ప్రత్యేక హెలికాఫ్టర్లతో వెళ్ళి, భారీ బందోబస్త్, పెద్ద ఎత్తున ప్రచారం కోసం ప్రతినెలా సీఎం చంద్రబాబు చేస్తున్న ఖర్చును వృద్దులు, దివ్యాంగుల కోసం చేస్తే భారం తగ్గదా..?

చంద్రబాబు దుర్మార్గాలపై పోరాడతాం:
అనంతపురం జిల్లాలోనే ఏడాది కాలంలో 19 వేల మందికి పైగా దివ్యాంగులకు పెన్షన్లు తొలగించారు. ఇప్పుడు తాజాగా దివ్యాంగులను  9601 పెన్షన్లను ఈ నెలలో తొలగించారు. వీరినే కాకుండా 2314 మందిని దివ్యాంగుల కోటా వర్తించదు కాబట్టి, వారిని వృద్దాప్య పెన్షన్ల కింద మార్పు చేస్తున్నామని నోటీసులు ఇచ్చారు. ఇంత అమానవీయంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం దారుణం. దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారు. అనంతపురం మున్సిపల కార్పోరేషన్‌లో 23వేల మందికి పైగా ఉంటే తాజాగా 1008 మందికి నోటీసులు ఇచ్చారు. ఇది చంద్రబాబు విశ్వాసఘాతకంగా చేస్తున్న పని.

ఎన్నికల ముందు దివ్యాంగుల పట్ల ఎంతో ప్రేమ చూపించి, వారి పక్షాన నిలబడతామని నమ్మించి, వారి ఓటుతో అధికారంలోకి వచ్చిన తరువాత అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నిన్న కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నంకు ఒక దివ్యాంగుడు ప్రయత్నించాడు. పెన్షన్లు తీసేస్తే ఎలా బతకాలని దివ్యాంగులు ఆవేదన చెందుతున్నారు. తమ దుర్మార్గంపై దివ్యాంగులు పోరాటం చేయలేరనే ధీమాతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. వారి పక్షాన పోరాడేందుకు వైయస్ఆర్‌సీపీ సిద్దంగా ఉంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ దివ్యాంగుల వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నారు. కలెక్టర్ కార్యాలయాలను దిగ్భందం చేస్తాం.

టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలకు చంద్రబాబు అండ:
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బరితెగించి మహిళల పట్ల కూడా అనుచితంగా మాట్లాడటం, వ్యవహరించడం చూస్తున్నాం. అనంతపురంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పైన దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ప్రోత్సహిస్తూ, పైకి మాత్రం వారిపై ఆగ్రహంతో ఉన్నట్లుగా నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి నందమూరి హరికృష్ణ భార్య. స్వర్గీయ ఎన్టీఆర్ కోడలు. అంటే నందమూరి కుటుంబానికి చెందిన మహిళపైనే, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు నోరు పారేసుకుంటే, పైపై మందలింపుల డ్రామాతో సరిపెట్టడానికి చంద్రబాబు ఎందుకు తంటాలు పడుతున్నారు.

మీ సతీమణి భువనేశ్వరిపై ఎవరో వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున యాగీ చేసిన చంద్రబాబుకు, తన సోదరి వరస అయ్యే హరికృష్ణ సతీమణి పై సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? నాలుగైదేళ్ళ కిందట సోషల్ మీడియాలో మహిళల పట్ల పోస్ట్‌లు పెట్టారంటూ రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లను వెదికి వెదికి పట్టుకుని, జైళ్ళ పాలు చేశారు. మరి మీ పార్టీలోనే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు, మీ కుటుంబంలోని ఒక మహిళ పట్ల ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎందుకు కఠినంగా స్పందించడం లేదో చంద్రబాబే చెప్పాలి. సీఎం అండతోనే టీడీపీ ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement