
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుడు, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందుకొచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. టీడీపీ శ్రేణులు ఓవరాక్షన్‌కు దిగాయి. దీంతో, పోలీసులు కలుగజేసుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు.
ఇక, అంతకుముందు.. పెద్దారెడ్డి పోలీసు బందోబస్తు మధ్య శుక్రవారం ఉదయం తన నివాసానికి చేరుకున్నారు. తన ఇంటికి వెనుక వైపునున్న ప్రహరీ కొంత తొలగించి గేటు నిర్మాణం చేపట్టారు. అయితే, అది నచ్చని జేసీ మున్సిపల్ అధికారులను ఉసిగొల్పి గేటును ధ్వంసం చేయించి యథావిధిగా గోడ నిర్మాణం చేపట్టారు. ఆ సమయంలో సోషల్ మీడియా ద్వారా తన అనుచరులను వెంటనే రావాలంటూ జేసీ మెసేజ్ పెట్టారు. అనుచరులు తన ఇంటి వద్దకు చేరుకోగానే జేసీ ప్రభాకర్‌రెడ్డి వారితో కలిసి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందున్న కళాశాల క్రీడా మైదానంలోకి చేరుకున్నారు. కేకలతో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. అదే సమయంలో ఏఎస్పీ రోహిత్‌కుమార్ పోలీసు బలగాలతో వచ్చి వారిని వెనక్కి పంపడంతో సమస్య సద్దుమణిగింది.
మరోవైపు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు బారికేడ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సమన్వయం పాటించాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచించారు. అనంతరం, జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు వెనక్కి పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందున్న గ్రౌండ్లో గుముకూడిన జెసి వర్గీయులు pic.twitter.com/FE6JL0mOGz
— YSRCP DHARMAVARAM (@sekharreddivari) September 19, 2025