మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కన్నీరు పెట్టుకున్నట్లు లీకులు
రాయచోటిని రద్దుచేస్తే రాజీనామా చేస్తానని తొలుత మంత్రి బీరాలు
ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు తలూపుకుంటూ సంతకం
మంత్రిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
ఆయన్ని ఓదారుస్తున్నట్లు సీఎం నాటకాలు
సాక్షి, అమరావతి: జిల్లాల పునర్విభజనలో రాయచోటి ప్రాంతాన్ని చావుదెబ్బ కొట్టిన తర్వాత కూడా అక్కడి ప్రజలను మాయచేసేందుకు సీఎం చంద్రబాబు తనదైన శైలిలో డ్రామాకు తెరలేపారు. ఇందుకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. రాయచోటి ఎమ్మెల్యేగా మంత్రివర్గంలో ఉన్న మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కన్నీరు పెట్టుకున్నట్లు, చంద్రబాబు ఆయన్ను ఓదార్చినట్లు అనుకూల మీడియాకు లీకులిచ్చి ప్రచారం చేసుకున్నారు. నిజానికి.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి తరలిస్తున్నా రాంప్రసాద్‌రెడ్డి కళ్లప్పగించి చూడడం తప్ప ఏమీచేయలేకపోయారు.
పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైనప్పుడు రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని తరలిస్తే తన పదవులకు రాజీనామా చేస్తానని బీరాలు పలికిన ఆయన ఇప్పుడు కేబినెట్ భేటీలో అందుకు సమ్మతి తెలుపుతూ సంతకం పెట్టారు. తన సొంత ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతున్నా మాట్లాడకుండా చంద్రబాబు చెప్పిందల్లా చేసి ఇప్పుడు సానుభూతి కోసం కన్నీరు పెట్టుకున్నట్లు డ్రామాలాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాంప్రసాద్‌రెడ్డి రాయచోటి కోసం పోరాడారని.. అయినా జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చిందని చంద్రబాబు చిలక పలుకులు పలికినట్లు లీకులు వచ్చాయి.
ఆ ప్రాంతం గొంతు పిసికి తీరిగ్గా సంతాపం వ్యక్తంచేసినట్లుగా చంద్రబాబు తీరు ఉందని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. తాజా నిర్ణయంతో మంత్రి స్థానికంగా తిరగలేని పరిస్థితి ఉంటుందని గ్రహించిన చంద్రబాబు ఈ డ్రామా ఆడించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే ఆయన మంత్రివర్గ సమావేశం నుంచి కళ్లు తుడుచుకుంటూ వచ్చి కారెక్కి వెళ్లిపోయారు. ఇక భావోద్వేగంతో ఆయన మాట్లాడలేకపోతున్నారని ఆయన సిబ్బంది సెలవిచ్చారు.
మంత్రి రాజీనామా శపథం ఏమైంది?
నిజంగా రాయచోటి ప్రాంతానికి మేలు చేయాలని ఉంటే మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తాను శపథం చేసినట్లు ఈ పాటికే రాజీనామా చేయాలి. కానీ, ఆ పని చేయకపోగా చంద్రబాబు ఎదుట తన ప్రాంతం గోడును కూడా వినిపించకుండా ఆయన చెప్పినచోట సంతకం పెట్టారు. తన నియోజకవర్గానికి అన్యాయం జరిగేలా చేసిన ప్రతిపాదనకు తానే సంతకం పెట్టి ఆమోదముద్ర వేసిన ఘనకీర్తి రాంప్రసాద్‌రెడ్డికే దక్కుతుందని విమర్శకులు మండిపడుతున్నారు. మంత్రిగా ఉండి తన నియోజకవర్గంలో ఉన్న జిల్లా కేంద్రాన్ని ఆయన కాపాడుకోలేకపోవడం అసమర్థతేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కూడా ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీకి విరుద్ధంగా రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చేసి ప్రజాభిప్రాయం అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.
జనాగ్రహం నుంచి గట్టెక్కేందుకే ఓదార్పు నాటకం..
ఇక జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు మంత్రి మండిపల్లిని ఓదార్చినట్లు.. జిల్లా కేంద్రాన్ని మార్చడంపట్ల తాను కూడా బాధపడినట్లు చంద్రబాబు లీకులిచ్చి నాటకాన్ని మరింత రంజింపచేశారు. అంత బాధపడేటప్పుడు జిల్లా కేంద్రాన్ని ఎందుకు మార్చారు? ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు? దురాలోచన లేకపోతే ప్రాథమిక నోటిఫికేషన్‌లో ఒకలా తర్వాత మరోలా ఎందుకు ప్రతిపాదన మార్చాల్సి వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. ఇదంతా కేవలం ప్రజాగ్రహం నుంచి తప్పించుకునే జిమ్మిక్కులేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


