గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు | Change of names of Village Ward Secretariat Names in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు

Dec 30 2025 2:38 AM | Updated on Dec 30 2025 2:38 AM

Change of names of Village Ward Secretariat Names in Andhra Pradesh

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులుగా నామకరణం

మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా 

ఇక రాయచోటి మదనపల్లెలో భాగం 

రంపచోడవరం నియోజకవర్గంతో పోలవరం జిల్లా.. నాలుగు నియోజక వర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు 

పలు మండలాలు అటు ఇటూ మార్పులు 

పెద్దాపురం మండలంలోకి సామర్లకోట.. రాజమండ్రిలోకి మండపేట మండలం 

పెనుగొండ మండలం పేరు వాసవి పెనుగొండగా మార్పు.. రైల్వేకోడూరు తిరుపతి జిల్లాకు.. రాజంపేట కడపలోకి.. 

అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాకు 

బాపట్ల జిల్లాలో టీడీపీ ఆఫీసుకు రెండెకరాల ప్రభుత్వ భూమి లీజుకు.. 

వైద్య కళాశాలల టెండర్ల గడువు పొడిగింపుపై పరిశీలన.. కేబినెట్‌ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రులు అనగాని, నాదెండ్ల, సత్యకుమార్‌ 

 సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల పేరును చంద్రబాబు సర్కారు మార్చేయనుంది.  గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పేర్లకు బదులు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులుగా నామకరణం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. అలాగే, రెండు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు పలు మండలాలను అటూ ఇటూ మార్చనున్నారు.

బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చనున్నారు. మోటారు వాహనాల లైఫ్‌టాక్స్‌పై 10 శాతం చొప్పున రోడ్‌ సేఫ్టీ సెస్‌ విధించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు మోటార్‌ వాహనాల పన్నుల చట్టం–1963లో పలు వసరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు..  

రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు.. 
జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రంపచోడవరం నియోజకర్గంతో పోలవరం జిల్లా.. నాలుగు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు.  

 రాయచోటికి బదులుగా మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లాను మార్పుచేస్తున్నారు. రాయచోటి మదనపల్లిలో భాగంగా ఉంటుంది. తొమ్మిది జిల్లాల్లో ఎటువంటి మార్పులు చేయలేదని.. 17 జిల్లాల్లో 25 మార్పులు చేసినట్లు మంత్రి అనగాని తెలిపారు. పలు మండలాలను అటు ఇటూ మార్పులు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ మార్పులు చేర్పులతో ఈనెల 31న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అవుతుందని, వచ్చేనెల 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయన్నారు. 

 సామర్లకోటను పెద్దాపురం మండలంలోకి.. మండపేట మండలాన్ని రాజమండ్రిలో కలపనున్నారు. పెనుగొండ మండలం పేరు వాసవి పెనుగొండగా.. రైల్వేకోడూరు తిరుపతి జిల్లాకు.. రాజంపేట కడపలోకి.. సిద్దవటం ఒంటిమిట్ట కడపలోకి మారుస్తున్నారు. మడకసిర రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకానుంది. బాపట్ల నుంచి అద్దంకి నియోజకవర్గం తిరిగి ప్రకాశం జిల్లాకు మార్పు. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాకు.. మరో రెండు మండలాలను తిరుపతి జిల్లాకు మార్పు. ఆదోని మండలాన్ని ఆదోని–1 మండలం, ఆదోని–2 మండలంగా మార్పు. గ్రేటర్‌ విజయవాడ, గ్రేటర్‌ తిరుపతి ప్రతిపాదనలున్నాయి.  

   మోటారు వాహనాల లైఫ్‌టాక్స్‌పై 10 శాతం చొప్పున రోడ్‌ సేఫ్టీ సెస్‌ విధింపు. ఈ సెస్‌ మొత్తాన్ని రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు బదిలీచేసి రోడ్ల మెరుగుదల, రోడ్డు భద్రతా చర్యలను చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రోడ్‌ సేఫ్టీ సెస్‌ ద్వారా ఏటా రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం మోటార్‌ వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంతో వాహన కొనుగోలుదారులకు కొంత ఆదా అవుతోంది. ఈ చిన్న సెస్‌ విధించడంవల్ల వాహన యజమానులపై ఆరి్థక భారం పెద్దగా ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.  

 దుగ్గరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు, షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌ స్థాపనకు గ్రీన్‌సిగ్నల్‌. 
 నెల్లూరు జిల్లా దామవరం గ్రామంలో 418.14 ఎకరాల భూమిని దగదర్తి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు అనుమతి. అలాగే, జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదించిన దాని ప్రకారం శాశ్వత లీజ్‌ హోల్డర్లకు ఎకరాకు రూ.13 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు అంగీకారం. 

బాపట్ల మండలంలోని వెస్ట్‌ బాపట్ల గ్రామంలో ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిని బాపట్ల టీడీపీ జిల్లా అధ్యక్షుడికి లీజ్‌ పద్ధతిలో కేటాయించి, టీడీపీ  జిల్లా కార్యాలయ భవనం నిర్మాణానికి అనుమతి. ఎకరాకు సంవత్సరానికి రూ.1,000 చొప్పున లీజ్‌ రుసుము చెల్లిస్తూ, 33 ఏళ్లపాటు లీజుకు ఆమోదం.  
ఎన్‌ఎస్సీఎఫ్‌డీసీ (జాతీయ షెడ్యూలు కులాల ఆరి్థక అభివృద్ధి సంస్థ) ద్వారా ఎస్సీలు తీసుకున్న రుణాలపై వడ్డీ రూ.41 కోట్లు మాఫీ.  
అమరావతిలో యోగా నేచురోపతి ఇనిస్టిట్యూషన్‌కు భూమి కేటాయింపు. అలాగే, విశాఖలో ఆసుపత్రి ఏర్పాటుకు కూడా.. 

తొలుత ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు నిర్ణయం. అలాగే, విద్యుత్‌ రంగంలో మరిన్ని అప్పులకు అనుమతి. 
సీఆర్‌డీఏలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుకు నాబార్డు  నుండి రూ.7,387.70 కోట్ల రుణం పొందేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి.   
సీఆర్‌డీఏలో ఉండవల్లి వద్ద ఫ్లడ్‌ పంపింగ్‌ స్టేషన్‌–2 కమిషనింగ్‌ (కెపాసిటీ 8,400 క్యూసెక్‌) 15 ఏళ్ల ఆపరేషన్‌–మెయింటెనెన్స్‌తో లంప్‌సమ్‌ కాంట్రాక్టు  ప్రాతిపదికన ఎల్‌–1 బిడ్‌ ఆమోదించేందుకు అనుమతి.  

 మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రూ.1,673.51 కోట్ల అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదనకు ఆమోదం.   
డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 9.88 ఎకరాల లీజును మూడేళ్ల కాలానికి పునరుద్ధరించాలన్న రెవెన్యూ శాఖ ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్‌. ఈ భూమిని వేదాంత లిమిటెడ్‌కు ఆన్‌షోర్‌ డ్రిల్లింగ్‌ కార్యకలాపాల కోసం కేటాయించనున్నారు.  

సీఆర్‌డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపునకు సంబంధించిన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులకు ఓకే. 
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు–ఫేజ్‌– ఐ–స్టేజ్‌– ఐలోని పంపింగ్‌ స్టేషన్లకు ఆమోదించిన డిజైన్లు/డ్రాయింగ్‌ల ప్రకారం ఇండక్షన్‌ మోటార్లలో పెరిగిన మెగావాట్‌ కెపాసిటీ కోసం అదనపు ఖర్చు రూ.76,80,000ల మొత్తానికి పరిపాలనా అంగీకారం. 
 రాజముద్రతో త్వరలోనే 21.87 లక్షల మంది రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ.  

పీపీపీ విధానంలోనే మెడికల్‌ కాలేజీలు..
ఇక వైద్య కళాశాలల నిర్మాణానికి పీపీపీ విధానంలోనే ముందుకెళ్తామని, వెనక్కు వెళ్లేదిలేదని మంత్రి సత్యకుమార్‌ స్పష్టంచేశారు. ఆదోని వైద్య కళాశాలకు రాజ్‌కుమార్‌ ప్రేమ్‌చంద్‌ షా బిడ్‌ దాఖలు చేశారని, మరికొన్ని సమరి్పంచడానికి గడువు కోరారని, అయితే.. గడువు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒక్క బిడ్‌ వచి్చనాసరే ముందుకెళ్తామని మంత్రి తేల్చిచెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement