బిడ్డకు జన్మనిచ్చి తీవ్ర రక్తస్రావంతో తల్లి మృతి
ఆ బాలింత మృతదేహం తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం
ఘటనా స్థలిలోనే మృతిచెందిన నవజాత శిశువు
హిందూపురం టౌన్/ పెనుకొండ : తీవ్ర రక్తస్రావంతో మృతిచెందిన తల్లి మృతదేహాన్ని తరలిస్తుండగా... ఆ వాహనానికి ప్రమాదం జరగడంతో అందులో ఉన్న నవజాత శిశువు ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచింది. హృదయాలను కలిచివేసే ఈ దుర్ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది. హిందూపురం ఆస్పత్రి నుంచి వైద్యులు అనంతపురం రిఫర్ చేయడం వల్లే తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం బసవనపల్లికి చెందిన నజ్మాకు బత్తలపల్లికి చెందిన కలీంతో రెండేళ్ల క్రితం వివాహమైంది.
నజ్మాకు పురిటి నొప్పులు రావడంతో రెండో కాన్పు కోసం ఆదివారం హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం జరిగిన కొద్ది సేపటికే నజ్మాకు తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు బీపీ పెరగడంతో వైద్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ నజ్మా మృతి చెందింది. సోమవారం ఉదయం ప్రభుత్వ అంబులెన్స్‌లో నజ్మా మృతదేహంతోపాటు నవజాత శిశువును తీసుకుని కుటుంబ సభ్యులు బసవనపల్లికి బయలుదేరారు.
మార్గంమధ్యలో పెనుకొండ వద్ద 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వీరి వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవజాత శిశువు అక్కడికక్కడే చనిపోయింది. వాహనంలోని ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే మెరుగైన చికిత్స అందించి ఉంటే తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచేవని... అనంతపురం రిఫర్ చేయడం వల్లే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.


