ప్రమాదంలో మృతి చెందిన వృద్ధుడు వద్ద లభించిన కాలిన కరెన్సీ నోట్ల కట్టలు
ఒకరు మినహా అంతా సేఫ్
అనకాపల్లి జిల్లా నర్సింగిబిల్లి–యలమంచిలి స్టేషన్ల మధ్య రెండు ఏసీ బోగీలు దగ్ధం
బీ1 బోగీలో విజయవాడ వాసి సజీవ దహనం
సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు ఘటన
బ్రేక్ వేసినప్పుడు ప్రెజర్‌లో తేడాల వల్ల నిప్పు రాజుకుని మంటలు చెలరేగాయని ప్రాథమికంగా నిర్థారణ
ప్రయాణికుడు చైన్ లాగడంతో తప్పిన పెనుప్రమాదం
సాక్షి, అనకాపల్లి/సామర్లకోట: ఎర్నాకుళం వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జార్ఖండ్‌లోని టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్–18189)లో అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద భారీగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడడంతో బీ–1, ఎం–2 ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. పొగ విపరీతంగా కమ్ముకోవడంతో బీ–1 బోగీలో ప్రయాణిస్తున్న విజయవాడ వాసి చంద్రశేఖర్ సుందర్ (70) అనే వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయి.. అగ్నికీలల్లో సజీవ దహనమయ్యాడు.
ఈ ఘటనతో యలమంచిలి రైల్వేస్టేషన్‌లో రెండు గంటలపాటు భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి నుంచి అగి్నమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈలోపు లోకో పైలట్లు కాలిపోతున్న రెండు బోగీలను వేరుచేసి మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు.
పరుగులు తీసిన ప్రయాణికులు
మంటలు చెలరేగిన రెండు ఏసీ బోగీల్లోని ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగి యలమంచిలి రైల్వే స్టేషన్‌లోకి పరుగులు తీశారు. లగేజీలను కూడా వదిలేసి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ మంటల్లో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సజీవ దహనమైన ఒక్కరు మినహా అంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన రెండు బోగీలతోపాటు ఎం–2 బోగీని కూడా తప్పించి ఉదయం 7 గంటలకు రైలు బయల్దేరింది. ఆ బోగీల నుంచి దింపేసిన సుమారు 125 మంది ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడ మూడు కొత్త బోగీలు అటాచ్ చేసి ప్రయాణికులను అదే రైలులో వారి గమ్యస్థానాలకు పంపించారు.
రైలు కదలికలో తేడా రావడంతో..
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో నర్సింగిబిల్లి–యలమంచిలి స్టేషన్ల మధ్య బ్రేకుల్లో తలెత్తిన లోపాల కారణంగా.. ఏసీ బోగీలో అర్ధరాత్రి సమయంలో పొగ రావడం మొదలైంది. ఆ తరువాత కొద్దిసేపట్లోనే యలమంచిలి స్టేషన్‌కు రైలు చేరుకుంది. వాస్తవానికి ఇక్కడ ఆ ట్రైన్‌కు హాల్టు లేదు. ఈ రైల్వేస్టేషన్‌లో లోకో పైలట్ల విశ్రాంతి గది ఉండటంతో ఒక పైలట్‌ను దించేందుకు రైలును ఆపినట్టు రైల్వే సిబ్బంది చెప్పారు. ముందుగా రైలు వేగాన్ని తగ్గించి.. స్టేషన్‌కు రాగానే బ్రేక్ వేశారు. ఆ సమయంలో బ్రేకుల్లో లోపాలున్నట్టు అర్థమైంది. బ్రేక్‌లు పట్టేయడం, రైలు కదలికలో తేడాను పైలట్లు గమనించారు.
దిగి చెక్ చేయాలని భావిస్తున్న సమయంలోనే.. ప్రయాణికులు చైన్ లాగిన సంకేతాలు వచ్చాయి. దీంతో లోకో పైలట్లు వేగంగా చైన్ లాగిన బోగీలవైపు పరుగులు తీశారు. బోగీల్లో మంటలు మొదలవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ.. ప్లాట్‌ఫామ్ పైకి దిగి పరుగులు తీశారు. యలమంచిలి రైల్వే స్టేషన్‌లో రైలును నిలపడంతో ప్రయాణికులు తొందరగా సులువుగా ప్లాట్‌ఫామ్‌పైకి దిగగలిగారు. ఫైర్ ఇంజిన్లు త్వరితగతిన చేరుకోగలిగాయి. అక్కడ రైల్వే పోలీసు సిబ్బంది కూడా ఉండటం వల్ల వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టగలిగారు. లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు చెప్పారు.
మృతుడి బ్యాగ్‌లో నగదు, బంగారం గుర్తింపు
ప్రమాదంలో మృతి చెందిన చంద్రశేఖర్ సుందర్ బ్యాగులో నగదు, బంగారం ఉన్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల సమక్షంలో బ్యాగును తెరిచి చూడగా.. అందులో రూ.6.50 లక్షల నగదు, బంగారం ఉంది. చాలావరకు నోట్ల కట్టలు కాలిపోయి ఉన్నాయి. మృతుడు విజయవాడలో హోల్‌సేల్ వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. విజయనగరంలో ఒక వస్త్ర దుకాణం నుంచి డబ్బు వసూలు చేసుకుని విజయవాడ వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. మృతుడి బ్యాగ్‌లో దొరికిన రూ.6.50 లక్షల నగదు, బంగారు ఆభరణాలను అతడి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
బ్రేకులు పట్టేయడమే కారణమా?
ప్రమాదానికి కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. బ్రేకుల ఫెయిల్యూరే కారణమా లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు. ప్రమాద స్థలాన్ని సోమవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ, విజయవాడ డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా, రైల్వే డీఐజీ బి.సత్య ఏసుబాబు, రైల్వే సేఫ్టీ అధికారులు పరిశీలించారు.
డీఆర్‌ఎం మోహిత్ మాట్లాడుతూ.. బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు చెలరేగాయని.. బోగీల్లో ఉన్న దుప్పట్లు అంటుకుని మంటలు శరవేగంగా వ్యాపించాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుడి కుటుంబానికి రైల్వే శాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. సౌత్ సెంట్రల్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవిని విచారణాధికారిగా నియమించారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి రెండు బోగీలు పూర్తిగా దగ్ధమై ఒక ప్రయాణికుడు మృతిచెందడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మృతుడి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు.
సీట్ల కింద నుంచి మంటలొచ్చాయి
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ బీ–1 బోగీలో ఆదివారం రాత్రి 10.30 గంటలకు అనకాపల్లిలో ఎక్కాను. రైలు యలమంచిలి చేరుకుంటున్న సమయంలో పైబెర్తులోని ప్రయాణికుడు టాయిలెట్‌కు వెళ్లూ బోగీలోని సీట్ల కింద నుంచి మంటలు వస్తున్న విషయాన్ని గమనించి నాకు చెప్పాడు. ఆయన, నేను కేకలు వేస్తూ బోగీలోని ప్రయాణికులను నిద్రలేపి చైన్ లాగాం. అప్పటికే రైలు యలమంచిలి స్టేషన్‌కు వచ్చి ఆగింది.
వెంటనే ప్రయాణికులు రైలులోంచి ప్రాణభయంతో దిగేశారు. అదే సమయంలో సమీపంలోని ఎం–2 బోగీకి కూడా మంటలు వ్యాపించాయి. యలమంచిలి రైల్వేస్టేషన్ ఆవరణ అంతా పొగతో నిండిపోయిది. ప్రమాదం జరిగిన బోగీల్లోని ప్రయాణికులను సామర్లకోట తీసుకు వచ్చారు. చాలామంది తమ లగేజీలను అక్కడే వదిలేసి ఇక్కడకు వచ్చారు. –నాగేంద్ర, ప్రత్యక్ష సాక్షి


