
సాక్షి, అనంతపురం: సీఎం చంద్రబాబు మాట్లాడిన 'దుష్టుల పాలన'కు కూటమి సర్కార్ అద్దం పడుతోందని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన మద్యాన్ని, సరసమైన ధరకే ఇస్తానంటూ బ్రాండ్ అంబాసిడర్‌గా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తంబళ్ళపల్లిలో బయటపడ్డ కల్తీ మద్యం తయారీ డెన్‌పై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఈ మద్యం తయారీదారులు తన సొంతపార్టీ వారే కావడంతో వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని, సూత్రదారులను తప్పించేందుకు సిద్దమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, కల్తీ మద్యంతో జేబులు నింపుకునే వారికి కూటమి ప్రభుత్వ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బయపడని కల్తీ మద్యం డెన్‌లు మరిన్ని ఉన్నాయని, మద్యం ముసుగులో దండుకోవడం చంద్రబాబుకు అలవాటేనని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..
చంద్రబాబు ఆటోడ్రైవర్ల సేవ కార్యక్రమంలో మాట్లాడుతూ దుష్టుల పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వానికే దుష్టుల పాలన అనే పదం సరిగ్గా సరిపోతుంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు ఈ రాష్ట్రానికి పట్టిన దుష్టగ్రహం ఎవరో? ఏడాదిన్నర కూటమి పాలనలో సీఎంగా చంద్రబాబు ఎన్ని అబద్దాలు ఆడారో లెక్కలేదు. చెప్పిన అబద్దాన్ని చెప్పకుండా రాజకీయం చేయడంలో చంద్రబాబు దిట్ట. సూపర్ సిక్స్ అనేదే పెద్ద అబద్దం. దాని గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక మందం అంటూ మాట్లాడతారు.
గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరిగిందంటూ ఒక బేతాళకథను సృష్టించి, రోజుకో మలుపుతిప్పుతూ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. అసలు స్కాం అంటే ఏమిటీ అంటే ప్రభుత్వపరంగా నడుస్తున్న లిక్కర్ దుకాణాలను ప్రైవేటు వారికి అప్పగించి, వేలం పేరుతో తమకు కావాల్సిన వారికి ఆ మద్యం దుకాణాలను కట్టబెట్టి, వాటికి అనుబంధంగా ఊరూరా బెల్ట్‌షాప్‌లను ఏర్పాటు చేసుకుని, ఎమ్మార్పీ రేట్లకు మించి ఇష్టం వచ్చిన ధరకు మద్యం అమ్ముకోవడాన్ని లిక్కర్ స్కాం అంటారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది అక్షరాలా ఈ స్కామే.
రాష్ట్రంలో తొంబై తొమ్మిది శాతం మద్యం దుకాణాలు కూటమి నేతల చేతుల్లోనే ఉన్నాయి. ఎవరికైనా వేలంలో వస్తే వారిని బెదరించి మరీ తమ పరం చేసుకున్నారు. దీనిపై విచారణకు సిద్దమా? అధిక ధరలకు, తమకు నచ్చిన బ్రాండ్‌లను మాత్రమే అమ్ముతూ దాని నుంచి వచ్చిన డబ్బును కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు.
ప్రభుత్వానికి తెలియకుండానే కల్తీ మద్యం తయారు చేస్తున్నారా?
తాజాగా తంబళ్లలపల్లిలో బయటపడ్డ నకిలీ మద్యం డెన్‌తో సీఎం చంద్రబాబు బండారం బయటపడింది. రోజుకు ఇరవై వేల బాటిళ్ళ నకిలీ మద్యాన్ని తయారు చేసి, పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారంటే, ఇది ఈ ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతోందా? స్పిరిట్‌తో ఒక పరిశ్రమ మాదిరిగా నకిలీ మద్యంను తయారు చేసి చెలామణి చేస్తున్నా ఈ ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేదా?
తెలుగుదేశం నాయకులే ఈ నకిలీ మద్యం డెన్‌ను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున మందుబాటు ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతోందా? లేక తన పార్టీ వారి నుంచి ఈ అక్రమ దందాలో వాటాలు అందుకుంటోందా? చంద్రబాబే దీనికి సమాధానం చెప్పాలి. తంబళ్ళపల్లిలో బయటపడింది గోరంత మాత్రమే. ఇంకా రాష్ట్రంలో కొండత నకిలీ మద్యం డెన్‌లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఉన్న మద్యం నాణ్యతను పరీక్షించాలి.
కల్తీ మద్యం మాఫియాకు అండదండలు
ఏడాదిన్నరగా ఈ రాష్ట్రంలో ఎన్ని చోట్ల నకిలీ మద్యం కర్మాగారాలను ఏర్పాటు చేసి, మార్కెట్‌లో విక్రయించారో నిజాలు వెల్లడించాలి. ఈ నకిలీ మద్యం డెన్‌లలో పనిచేసేవారు ఒడిస్సా, తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్లుగా బయటపడింది. ఈ నకిలీ మద్యం తయారీ మాఫియాలో ఎవరెవరు భాగస్వాములూ ఉన్నారో బయటపెట్టాలి. ఈ వ్యవహారంలో చంద్రబాబుకు సంబంధించిన వారే సూత్రదారులు, పాత్రదారులు. డెన్‌లో పనిచేసే కొందరు కూలీలను పట్టుకుని, వారినే బాధ్యులుగా చూపి, అసలు మాఫియా ముఠాదారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ నకిలీ మద్యం తయారీ కొనసాగుతోంది. ఎన్ని కోట్ల రూపాయలు ఈ దందాతో సంపాధించారో వెల్లడించాలి. ఇప్పుడు కూటమి పాలనలో జరుగుతున్న దానిని లిక్కర్ స్కాం అని కూడా అనలేం, దీనిని స్కాంలకే స్కాం అని పిలవాల్సి ఉంటుంది. నాణ్యమైన మద్యం ఇస్తామంటే దాని అర్థం తమ పార్టీ వారితో కుటీర పరిశ్రమ మాదిరిగా నకిలీ మద్యాన్ని తయారు చేయించి, చెలామణి చేయించడమేనా?. గత ప్రభుత్వంలో బార్లకు ప్రివిలేజ్ చార్జీలను పెంచాలని అధికారులు సిఫారస్ చేస్తే, దానిని హటాత్తుగా రద్దు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ముడుగపులు అందుకుని, సీఐడీ విచారణలో ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు లిక్కర్ స్కాం గురించి మాట్లాడుతున్నాడు
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోంది
అనంతపురం శిశుసంక్షేమ సంరక్షణ గృహంలో నవజాత శిశువుకు కనీసం పాలు ఇచి, ఆకలి తీర్చే వారు లేక శిశువు చనిపోయిందంటే దానికి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా? ఏడుగుర్రాలపల్లిలో రెండేళ్ళపాటు ఇక దళిత బాలికపై పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు దాష్టీకం చేసినా, ఈ ప్రభుత్వం మిన్నకుండిపోయింది. నారా లోకేష్ యువగళంలో ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఆటోడ్రైవర్లు ఉన్నారు, వారికి వైయస్ జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా?
ఆటోడ్రైవర్ల సేవ పేరుతో కేవలం 2.90 లక్షల మందికి మాత్రమే సాయంను అందించారు. ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి రాగానే మరొకలా మాట్లాడటమేనా మీ గొప్పతనం? నారా లోకేష్ చెప్పినట్లుగా పదమూడు లక్షల మంది ఆటోడ్రైవర్లకు రూ.15వేల చొప్పున ఇవ్వాలంటే దానికి రూ.2250 కోట్లు అవసరం. కానీ మీరు ఇచ్చింది ఎంత అంటే కేవలం రూ.436 కోట్లు మాత్రమే. ప్రతి పథకంలోనూ ప్రచారం తప్ప, నిజంగా ఆ వర్గాలకు సాయం చేయాలనే చిత్తశుద్ది లేదు. కూటమి ఎన్నికల మేనిఫేస్టోలో లారీ, టిప్పర్ డ్రైవర్లకు కూడా సాయాన్ని ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? ఒక్క పథకాన్ని అయినా ఇచ్చిన హామీ మేరకు అమలు చేయలేని అసమర్థ పాలన చూస్తున్నాం.