
సాక్షి, అనంతపురం: తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెద్దారెడ్డి ఇంటిని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి టార్గెట్ చేశారు. ఆక్రమణలు ఉన్నాయంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు 11 గంటలకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేస్తామంటూ నోటీసులు ఇచ్చారు.
జేసీ ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేపట్టారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి ఇప్పటికే ఒకసారి కొలతలు వేసిన అధికారులు.. మళ్లీ మళ్లీ కొలతలు వేయడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పెద్దారెడ్డి సహా వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లను కూల్చేస్తానంటూ గతంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే.
కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ నెల 6న ఎట్టకేలకు తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పోలీసులు దిగొచ్చారు. ప్రభుత్వ అండతో టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. చివరికి ఆయన గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.