సాక్షి, అంబేద్కర్ కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం బాలిక మృతి కేసులో మిస్టరీ వీడింది. చిన్నారి రంజిత అనుమానాస్పద మృతి కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు. వేలిముద్రల ఆధారంగా రంజితను శ్రీను చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధిత కుటుంబానికి నిందితుడు తెలిసిన వ్యక్తి కావడం గమనార్హం.
కోనసీమ జిల్లాలో ఈ నెల నాలుగో తేదీన చిన్నారి రంజిత అనుమానాస్పద మృతిచెందిన విషయం తెలిసిందే. ఈకేసులో కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. తాజాగా పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా రంజితది హత్యగా నిర్ధారించారు. అయితే, రంజిత ఉంటున్న ఇంటి కింద గదిలో కోటి అనే యువకుడు ఇంటర్నెట్ షాప్ నిర్వహిస్తున్నారు. కోటికి యూట్యూబ్ చానల్లో పని చేస్తున్న కోటి స్నేహితుడు. శ్రీను రెగ్యులరుగా కోటి షాప్ దగ్గరికి వస్తూ ఉండేవాడు.
అయితే, తాను ఇంట్లో లేని సమయంలో రంజితకు కావాల్సిన వస్తువులను తనకు ఇవ్వాల్సిందిగా శ్రీనుకి చిన్నారి తల్లి సునీత చెప్పింది. ఈ క్రమంలో ఫ్యాన్ రిపేర్ అయిందని ఇంటికి వచ్చిన శ్రీను.. చున్నీ మెడకు బిగించి రంజితను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. తనపై అనుమానం రాకుండా విచారణకి వచ్చిన పోలీసులతో అతడు తిరిగినట్లు సమాచారం. అలాగే, లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో నిందితులను త్వరగా పట్టుకోవాలని శ్రీను మేసేజ్‌లు కూడా పెట్టినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని నిర్థారించిన అనంతరం, ఘటనా స్థలంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కూడా చేసినట్టు తెలిసింది. కాసేపట్లో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.


