గత ప్రభుత్వ చర్యలతో ట్రూడౌన్ రూపంలో భారీ ప్రయోజనం
రాష్ట్ర ప్రజలపై తప్పిన విద్యుత్ చార్జీల భారం
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన వినూత్న విధానాలవల్ల 2019–24 మధ్య విద్యుత్ సంస్థల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. ఫలితంగా.. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఆ మిగులును కొంత ప్రజలకు వెనక్కి ఇచ్చి, మిగతాది తమ ఇతర ఖర్చుల్లో సర్దుబాటు చేసుకున్నాయి. దానివల్ల రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం చాలావరకూ తప్పింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) తాజాగా రూ.134.08 కోట్లను ట్రూడౌన్ చేయడానికి అనుమతివ్వడంతో జగన్ హయాంలో జరిగిన రూ.5,252.93 కోట్ల ఖర్చుల పొదుపు అంశం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
నాడు మిగులు ఇలా..
2019–20 నుంచి 2023–24 వరకూ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) రూ.1,974.75 కోట్లు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) రూ.1,400 కోట్ల ఖర్చులు మిగిల్చాయి. ఈ మొత్తం రూ.3,374.75 కోట్లను ట్రూడౌన్ చేశాయి. 2024–25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక (ఏఆర్‌ఆర్)లో డిస్కంలు ఈ మొత్తాన్ని సర్దుబాటు చేశాయి. అంటే.. వాటి రెవెన్యూ గ్యాప్‌ను భర్తీచేసుకోవడానికి వినియోగించుకున్నాయి. తద్వారా బకాయిల భారాన్ని తగ్గించుకున్నాయి. వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం రాలేదు. అదే విధంగా 2019–20 నుంచి 2023–24 మధ్య 4వ నియంత్రణ కాలానికి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో)కు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను వినియోగించుకున్నందుకు ముందుగా ఆమోదించిన దానికంటే తక్కువగా డిస్కంలు వెచ్చించాయి.
తద్వారా డిస్కంలు రూ.1,059.76 కోట్లు మిగిల్చాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్‌లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్‌లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌లో 247.35 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్‌ఆర్‌లో సర్దుబాటు చేశారు. దీనికి అదనంగా మరో రూ.818.43 కోట్లు ఆదా అయినట్లు ఏపీఈఆర్‌సీ తాజాగా తేల్చింది. అంటే.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యుత్ పంపిణీ కోసం చేసిన ఖర్చుల్లో రూ.1,878.19 కోట్లు మిగిలాయి. ఈ మొత్తాన్ని డిస్కంలకు ఏపీ ట్రాన్స్‌కో తిరిగి ఇస్తోంది. ఈ మొత్తంలో ఇప్పటికే చాలావరకూ సర్దుబాటు చేయగా మిగిలిన రూ.134.08 కోట్లను వెనక్కు ఇచ్చేందుకు ఏపీఈఆర్‌సీ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
ఈ లెక్కన గత ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్ర ప్రజలపై రూ.5,252.93 కోట్ల ట్రూఅప్ భారం తగ్గింది. అదే విధంగా.. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 మధ్య కాలానికి డిస్కంలు వసూలుచేసిన ట్రూ అప్ చార్జీలు ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.70 కోట్లు చొప్పున మొత్తం రూ.196 కోట్లను ట్రూడౌన్ చేసి వినియోగదారులకు గత ప్రభుత్వంలో డిస్కంలు వెనక్కి ఇచ్చాయి. అది కూడా కలిపి గత ప్రభుత్వ చర్యల కారణంగా వినియోగదారులకు ట్రూడౌన్ రూపంలో మొత్తంగా రూ.5,448.93 కోట్లు ప్రయోజనం చేకూరింది.


